
విజయవాడ: వైసీపీ, బీజేపీ నేతల భేటీ వివరాలను టీడీపీ ఎంపీ వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి ఏపీ భవన్ నుంచి ప్రభుత్వ కారులో రాంమాధవ్ ఇంటికి వెళ్లారని టీడీపీ ఎంపీలు వెల్లడించారు. వీడియో ఫుటేజీ, కారు లాగ్ బుక్ వివరాలను ఎంపీలు మీడియాకు విడుదల చేశారు. ఏ కారులో ఏ సమయంలో ఎవరింటికి వెళ్లారో లాగ్ బుక్‌లో నమోదు చేశారని, ఇంకా వివరాలు కావాలన్నా నిరూపించేందుకు సిద్ధమని టీడీపీ ఎంపీలు సవాల్ విసిరారు.
వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. రాని ఎన్నికల కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని, బుగ్గన, ఆకుల కలిసి రాంమాధవ్ ఇంటికెళ్లారని, ఆ విషయాలను నిరూపిస్తామన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో విభజన హామీలను సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తారని, పార్లమెంట్ లోపలే కాదు బయట కూడా ఉద్యమిస్తామన ఎంపీ కనకమేడల చెప్పారు.