అనంతపురంలో వైసీపీకి భారీ షాక్‌

సింగిల్‌ విండో అధ్యక్షుడు కేవీ చౌదరి టీడీపీలో చేరిక
సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గోనుగుంట్ల
ధర్మవరం/అనంతపురం: బత్తలపల్లి మడలంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, బత్తలపల్లి సింగిల్‌ విండో అధ్యక్షుడు కేశనపల్లి వెంకటచౌదరి వైసీపికి గుడ్‌బై చెప్పి ఆదివారం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భారీ జనం మధ్య సుమారు 500 మందికి పైగా అనుచరులతో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కేవీ చౌదరితో పాటు ఆయన అనుచరులకు శాలువాలు కప్పి టీడీపీలోకి ఎమ్మెల్యే గోనుగుంట్ల ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం పెల్లుబికింది. కేశనపల్లి వెంకటచౌదరి మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, స్థానికంగా కూడా కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి పార్టీలకతీతంగా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదరించడమే తనను పార్టీలోకి చేరేలా ప్రేరేపించాయన్నారు.

జీవితాంతం ఎమ్మెల్యేగా గోనుగుంట్ల గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గోనుగుంట్ల మాట్లాడుతూ కేవీ చౌదరి టీడీపీలోకి రావడంతో పార్టీకి మరింత బలం చేకూరినట్లయిందన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కలగా మిగిలిపోవాల్సిందేనన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, ఆ మూడు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉండడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ కమతం కాటమయ్య, మండల కన్వీనర్లు వీరనారప్ప, నారాయణస్వామి, దేవేంద్రరెడ్డి, జక్కంపూటి వెంకటేశ్వరచౌదరి, జక్కంపూటి పురుషోత్తం చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *