వైఎస్సార్‌ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జీవితాధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ దర్శకుడు మహి వి.రాఘవ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

అయితే ఇందులో వైఎస్సార్‌ తండ్రి వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందులో రాజారెడ్డి పాత్రకు జగపతి సరిగ్గా సరిపోతారని భావించిన చిత్రబృందం ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 1925లో పుట్టిన రాజారెడ్డికి రాయలసీమ ప్రజల్లో ఎంతో గౌరవం ఉంది. 1998లో సంభవించిన బాంబు దాడిలో రాజారెడ్డి కన్నుమూశారు. ఈ విషయాలన్నీ సినిమాలో ప్రస్తావించనున్నారట.

మరోపక్క ప్రముఖ యాంకర్‌ అనసూయ కర్నూలుకు చెందిన రాజకీయనాయకురాలి పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్‌లో కానీ వచ్చే ఏడాది జనవరిలో కానీ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *