జగన్ పై దాడి: ఎవరీ శ్రీనివాస రావు?

కాకినాడ: వైఎస్ఆర్ సీపీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారాడు. అయితే శ్రీనివాసరావు జగన్ పై హత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారన్న విషయం తెలియడం లేదు. శ్రీనివాసరావు ఉద్దేశపూర్వకంగా జగన్ పై దాడికి పాల్పడ్డాడా లేక ఎవరైనా వెనుక ఉండి దాడికి ఉసిగొల్పారా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే నిందితుడు శ్రీనివాసరావు పూర్తి పేరు జనిపల్లి శ్రీనివాసరావు. ఇతన్ని తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గం ఠానేలంక గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసరావు కుటుంబం నిరుపేద కుటుంబం. ఆరుగురు సంతానంలో శ్రీనివాసరావు ఆఖరివాడు. శ్రీనివాసరావు పదోతరగతిపూర్తి చేసి ఐటీఐ చేశాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

శ్రీనివాసరావు ఐటీఐ అనంతరం కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నట్లు సోదరుడు సుబ్బరాజు తెలిపాడు. వివిధ పనులు చేస్తూ మా కుటుంబానికి అండగా నిలుస్తున్నట్లు తెలిపాడు. శ్రీనివాసరావు చాలా సౌమ్యుడని, ఎవరితోనూ వ్యక్తిగత గొడవలకు వెళ్లడని చెప్తున్నారు. జగన్ పై దాడి చేశారని వార్త తెలుసుకుని నమ్మలేకపోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకు శ్రీనివాసరావు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదని చెప్తున్నారు.

ఇకపోతే శ్రీనివాసరావుకు వైఎస్ జగన్ కు వీరాభిమాని. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పాదయాత్రలో పాల్గొన్నాడు. ఇకపోతే వైఎస్ జగన్ పేరిట ఫ్లెక్సీలు వేసి తన అభిమానం చాటుకుంటున్నాడు.

అయితే 8 నెలలుగా విశాఖ ఎయిర్ పోర్టులోని ఓ క్యాంటీన్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఎంతో సౌమ్యుడుగా మంచి యువకుడిగా పేరున్న శ్రీనివాసరావు దాడికి పాల్పడటం అందర్నీ విస్మయానికి గురి చేసింది.

ఇకపోతే ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత పుండరేష్ కు ప్రధాన అనుచరుడుగా శ్రీనివాసరావును చెప్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కోడిపందాలకు పెట్టింది పేరు. ఆ కోడిపందాల నిర్వహణలో ఉపయోగించే కత్తిని శ్రీనివాసరావు జగన్ పై దాడికి ఉపయోగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

శ్రీనివాసరావు పనిచేసే రెస్టారెంట్లో కూడా ఇలాంటి కత్తులు ఉపయోగించరు. అటు కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీనివాసరావు ఆ కత్తిని లోపలికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్ దాడి వెనుక ఎవరైనా ఉన్నారా లేక పబ్లిసిటీ కోసమే ఈ ఘటనకు పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. జగన్ కు వీరాభిమాని అయిన శ్రీనివాస్ ఆయనపై అభిమానం చూపాలే కానీ కత్తితో రక్తం కళ్లచూడరు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు జేబులో ఒక లెటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లేఖను విమానయాన శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విచారణ నిమిత్తం విశాకపట్నం పోలీసులకు శ్రీనివాస్ ను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో ఏముందని తెలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లో హత్యాయత్నం

జగనన్న అందుకే నిన్ను పొడిచేసా….

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *