టీడీపీలోకి మాజీ మంత్రి.. అక్కడ వైసీపీకి చెక్ పెట్టేందుకేనా..?

శ్రీకాకుళం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. ప్రస్తుతం వైసీపీ ఖాతాలో ఉన్న ఆ నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికారపార్టీ ఆరాటపడుతోంది. దీనికోసం అక్కడ ఇప్పటికే అభ్యర్థి ఎంపీక, వారి విజయానికి వ్యూహాలు సిద్ధమైపోతున్నాయట. అసలు ఆ నియోజకవర్గం ఏది? అక్కడేం జరుగుతోంది? వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!

శ్రీకాకుళం జిల్లా మొదటినుంచీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. ఎన్‌టీఆర్ హయాం మొదలు నేటి చంద్రబాబు వరకూ ఇక్కడి ప్రజలు పసుపు జెండానే భుజానికెత్తుకుంటున్నారు. టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో రాజాం కూడా ఒకటి. కానీ 2014 ఎన్నికల్లో స్థానిక నేతల తప్పిదాల కారణంగా రాజాం నియోజకవర్గంలో వైకాపా పాగా వేసింది. అక్కడ టీడీపీ తరఫున పోటీచేసిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి సమీప వైకాపా అభ్యర్ధి కంబాల జోగులపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

ఇలాంటి తరుణంలో రాజాం నియోజకవర్గంలో 2019లో టీడీపీ అభ్యర్థి ఎవరనే చర్చ పెద్దఎత్తున జరుగుతోంది. ప్రతిభాభారతి వరుసగా రెండుసార్లు ఓటమి పాలవడంతో టీడీపీ హైకమాండ్ ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు 2019 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానమైన రాజాం నియోజకవర్గాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని జిల్లా మంత్రులకు అధినేత చంద్రబాబు ఇప్పటికే ఉపదేశించినట్టు సమాచారం. దీంతో ఆ పార్టీ సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.

సీనియర్ నేతగా ఉన్న ప్రతిభాభారతికి సముచిత స్థానాన్ని ఇస్తూనే.. కొత్త అభ్యర్ధిని రంగంలోకి తేవాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే ప్రతిభాభారతికి ఎమ్మెల్సీ ఇచ్చి, కొత్త వ్యక్తి లేదా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులను పార్టీ తరఫున పోటీచేయించే యోచనలో టీడీపీ ఉందట. ఈ సమయంలోనే రాజాం నియోజకవర్గంలో మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్ పేరు ఎక్కువగా వినిపిస్తోందట. కొండ్రు మురళి మంత్రిగా ఉన్న సమయంలో రాజాంలో చేసిన అభివృద్ధితోపాటు స్థానిక ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం పార్టీకి కలిసొస్తుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట.

ఇదిలా ఉంటే, ఇప్పటికే మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్ పార్టీ మారాలని డిసైడ్‌ అయ్యారట. వాస్తవానికి కొండ్రు ఏపీసీసీ అధ్యక్ష పదవి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించారు. అయితే చివరివరకూ ఊరిస్తూ వచ్చిన హైకమాండ్ ఇప్పట్లో పీసీసీ పదవులు భర్తీ చేసే యోచన లేదంటూ తేల్చిందట. దీంతో కొండ్రు మురళి వేరు దారులు వెతుక్కుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ లేదా టీడీపీ కండువా కప్పుకోవాలనే భావనలో ఆయన ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన అనుచరులే చెబుతున్నారు. అయితే వైకాపాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులును కాదని కొండ్రు మురళికి జగన్ టిక్కెట్ ఇస్తారా అనే సందేహాలు ఆయన వర్గంలో వినిపిస్తున్నాయి. దీంతో ఆయన దృష్టి టీడీపీ పైనే ప్రధానంగా కేంద్రీకరించారంటూ వార్తలు వస్తున్నాయి.

వారం పదిరోజుల్లో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇస్తానని మాజీ మంత్రి కొండ్రు తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. మరోవైపు రాజాం నియోజకవర్గంలో నెలకొన్న సమీకరణాలను బట్టి వైకాపా కంటే టీడీపీలోకి వెళ్లటమే మంచిదని ఆయన అనుచరులు అంతర్గత సమావేశాల్లో గట్టిగా సూచించినట్టు వినికిడి! ఈ నేపథ్యంలో పార్టీ మారడం అంటూ జరిగితే టీడీపీలోకే వెళ్లాలని కొండ్రు నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితవర్గాల భోగట్టా!

వాస్తవానికి కొండ్రు మురళికి మంత్రిగా చేసిన అనుభవంతోపాటు పోల్ మేనేజ్‌మెంట్ బాగా తెలుసట. అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే గెలుపు గ్యారెంటీ అని తెలుగు తమ్ముళ్లు ఫిక్సయిపోయారట. రాజాం అభ్యర్ధిత్వం విషయంలో ఇప్పటికే కొండ్రు మురళి టీడీపీ పెద్దలను సంప్రదించినట్టుగా సమాచారం. అయితే సీటు విషయంలో క్లారిటీ వస్తే తప్ప పసుపు కండువా కప్పుకునేందుకు మురళి సంసిద్ధత వ్యక్తంచేయలేదట. చంద్రబాబాబు నుంచి గట్టి హామీ వస్తే ఈ మాజీమంత్రిగారు టీడీపీలోకి వెళ్లడం ఖాయమని ఇప్పటికే రాజాం నియోజకవర్గంలో పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది.

ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయముంది. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే రాజాంలో ఇప్పటికే ఎన్నికల వేడి కనిపిస్తోంది. అధికార పార్టీలో రోజుకో అభ్యర్ధి పేరు తెరమీదికి వస్తుండటంతో క్యాడర్‌లో ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ హైకమాండ్ రాజాంలో ఎవరిని బరిలోకి దింపుతుందో? ఎలా విజయ పతాకాన్ని ఎగురవేస్తుందో? అన్న అంశాలే అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. చూద్దాం వచ్చే రోజుల్లో ఏ నిర్ణయం వెలువడుతుందో!

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *