కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి ఫిక్స్.. మరి టీడీపీ నుంచి ఎవరో..!?

  • కాకినాడ రూరల్‌.. ఎవరో రూలర్‌..!
  • టీడీపీలో నలుగురు ఆశావహులు
  • అభ్యర్థి ఎవరో తెలియని జనసేన
  • త్రిముఖ పోటీకి అవకాశం
కాకినాడ : కాకినాడ బీచ్‌, పెద్ద పెద్ద పరిశ్రమలు, భవన్నారాయణస్వామి ఆలయం వంటి ప్రత్యేకతలతో కాకినాడ నియోజకవర్గం ప్రత్యేకమైనది. పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. కాకినాడ రూరల్‌, కరప మండలాలతోపాటు కార్పొరేషన్‌కు చెందిన ఆరు డివిజన్లతో కలిపి రూరల్‌ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. తొలిసారిగా ఇక్కడినుంచి పీఆర్‌పీ అభ్యర్థి విజయం సాధించగా అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రెండోస్థానంలో నిలిచారు. టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించగా వైసీపీ ద్వితీయం, ఇండిపెండెంట్‌ అభ్యర్థి మూడోస్థానంలో నిలిచారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతోపాటు జనసేన పార్టీల మధ్యే త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
ఎమ్మెల్యేతోపాటు మరో ముగ్గురు ఆశావహులు
అధికార టీడీపీకి చెందిన పిల్లి అనంతలక్ష్మి రూరల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటినుంచి నాలుగేళ్లలో నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం, తాగునీటి ప్రాజెక్టులు, బ్రిడ్జిలు, సిమెంట్‌ రోడ్ల నిర్మాణం, సామాజిక భవనాలు, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి పనులే తమను ఈసారి గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ‘ఆడపడచుగా వస్తున్నా.. ఆశీర్వదించండి’ అంటూ చేపట్టిన అభివృద్ధి పనులపై ఆమె కరపత్రాలు పంచుతూ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 61,144 ఓట్లు సాధించి 36.98శాతంతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ 52,096 ఓట్లతో 31.51శాతం ఓట్లతో ద్వితీయస్థానం సాధించారు.
ఈ దఫా ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపు సాధిస్తామనే ధీమాలో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే భర్త పిల్లి సత్యనారాయణమూర్తి ఈ దఫా ఎలాగైనా తనకే టిక్కెట్‌ అధిష్ఠానం కేటాయిస్తుందనే ధీమాలో ఉన్నారు. ఎమ్మెల్యే భర్త పార్టీలో సీనియర్‌ నేతలను కాదని, కొంతమంది నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థి మార్పు జరిగితే తమకే వస్తుందన్న ధీమాతో ఎమ్మెల్యే సామాజికవర్గానికే చెందిన ముగ్గురు నేతలు అధిష్ఠానంవద్ద పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపీలో ఆయనకే..
వైసీపీనుంచి ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, రూరల్‌ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలోకి దిగుతున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 53,494 ఓట్లు సాధించి అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిపై 8,037 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 43,742 ఓట్లు సాధించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. తదనంతరం వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అప్పటినుంచి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ కాకినాడ రూరల్‌ పరిధిలోని కాకినాడ రూరల్‌, కరప మండలాలతోపాటు కార్పొరేషన్‌ పరిధిలోని ఆరు డివిజన్లలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల వరకు వైసీపీకి మంచి పట్టు ఉందన్న అంచనాతో ఉన్న నేతలకు ఆ ఎన్నికల ఫలితాలు షాకివ్వడం, ఆరు డివిజన్లలో అభ్యర్థులు ఓటమి పాలవడంతో గెలుపుపై సందిగ్ధత నెలకొంది. నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరించడంతోపాటు తన గెలుపుపై కన్నబాబుపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలను బుజ్జగిస్తూ వైసీపీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ కన్నబాబుకే వైసీపీ అభ్యర్థిత్వం ఖరారవ్వడం, పోటీదారులు లేకపోవడంతో అంతా తానై వ్యవహరిస్తూ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు.
అయోమయంలో జనసేన
జనసేన పార్టీ నుంచి పోటీ ఎవరు చేస్తారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్ల తర్వాత స్థానంలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉండడంతో ఇక్కడ ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు, యువత ఉన్నారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపుపై అడపాదడపా ఆందోళనలు, నిరసనలు చేయడం, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం వంటి పనులకే ఆ పార్టీ నేతలు పరిమితమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జనసేన స్థాపించిన తర్వాత నేటి వరకు ఏ ఒక్క పెద్ద నాయకుడు ప్రధాన పార్టీల నుంచి రాకపోవడంతో ద్వితీయశ్రేణి నాయకులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజారాజ్యం స్థాపించి ఆ పార్టీ తరపున పోటీ చేసినప్పుడు అప్పట్లో పెద్ద నాయకులు లేకపోయినా ఆ పార్టీ వ్యక్తి ఎమ్మెల్యేగా నెగ్గడంతో జనసేన పార్టీ నేతలు తమ పార్టీ అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తారనే ఆశల పల్లకిలో ఉన్నారు.
కాంగ్రెస్‌ పోటీకి ఒకరు
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసే వారే కరువయ్యారు. రెండుసార్లు కాంగ్రె్‌సపార్టీ నుంచి జడ్పీటీసీగా పనిచేసిన నులుకుర్తి వెంకటేశ్వరరావు ఈ దఫా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రాష్ట్ర బీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకునే పనిలో ఉన్నారు.
నియోజకవర్గ ప్రత్యేకతలు
ఎన్టీఆర్‌ బీచ్‌ కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఉండడంతో ప్రభుత్వం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కోట్లాది నిధులతో బీచ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఎన్‌ఎ్‌ఫసీఎల్‌, కోరమండల్‌ ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి. తీరానికి ఆనుకుని పలు ఆయిల్‌ రిఫైనరీ కంపెనీలు ఉన్నాయి. జిల్లా పరిశ్రమల కేంద్రం రమణయ్యపేటలో ఉంది. ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ ఉంది. జిల్లాలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీరాజ్యలక్ష్మి భావనారాయణస్వామి ఆలయం సర్పవరంలో ఉంది. దేశంలోనే ఎత్తైన 116 అడుగుల విగ్రహం రేపూరులో ఉంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *