
మా అమ్మాయిని ఫలానా అబ్బాయి వేధిస్తున్నాడని ఫిర్యాదులు రావడం కామన్..! కానీ ఇందుకు భిన్నంగా తమ కుమారుడ్ని ఓ మహిళ లైంగికంగా వేధిస్తోందంటూ ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన విజయవాడ పాయకాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాయకాపురం వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ (45) భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్లిద్దరికీ వివాహం చేసి అత్తారింటికి పంపేసింది. అప్పటి నుంచి ఆమె ఒంటిరిగా ఉంటోంది. ఆమె ఇంటి ఎదురుగా ఉంటున్న పదిహేనేళ్ల బాలుడు ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఎదురింటి వారనే చొరవతో ఆ బాలుడు ఆ మహిళ ఇంటికి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో అతనితో ఆమె అసభ్యకరంగా ప్రవర్తిస్తోంది. పైగా పిలిచినప్పుడల్లా తన వద్దకు రావాలని ఒత్తిడి చేయడంతో ఆ బాలుడు భయపడ్డాడు. అప్పటి నుంచి అక్కడ ఉండడం మానేసి దూరంగా ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇంటికి రావకపోవడానికి కారణమేమిటని తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన విషయం చెప్పాడు. దీంతో బాలుడి తల్లి ఆ మహిళపై చేయి చేసుకుంది. దీంతో ఆ మహిళ నున్న రూరల్ పోలీస్స్టేషన్లో బాలుడి తల్లిపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు బాలుడి తల్లిదండ్రులను పిలిపించి విచారించగా, వారు అసలు విషయం చెప్పారు. దీంతో ఆ మహిళపై బాలల హక్కుల సంరక్షణ చట్టం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.