రాజధాని స్థాయికి తగ్గట్టుగా గన్నవరం విమానాశ్రయం

అమరావతి రాజధాని ప్రాంతం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకూ సులభంగా చేరుకునే విమాన అనుసంధానం అందుబాటులోనికి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి విమాన సర్వీసుల సంఖ్య గత ఆరు నెలల్లోనే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. ఒక్కొక్కటిగా దిల్లీ, ముంబయి సహా ప్రధాన నగరాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రీజినల్‌ కనెక్టివిటీలో భాగంగా ఉడాన్‌ పథకం కింద కడపకు సైతం ట్రూజెట్‌ సర్వీసు అందుబాటులోనికి వచ్చింది. నిత్యం ఉదయం 8.05కు 72 సీటింగ్‌తో ట్రూజెట్‌ సర్వీసు కడపకు బయలుదేరి వెళుతుంది. గురువారం నుంచి ఈ సర్వీసును ప్రారంభించారు. నేటినుంచి మరో పది సర్వీసులను ఇండిగో సంస్థ ప్రారంభిస్తోంది. దీంతో ఉదయం 7.45 నిమిషాల నుంచి ప్రారంభమయ్యే సర్వీసులు రాత్రి 9.10 వరకూ ప్రతి గంటకూ నాలుగు చొప్పున గన్నవరం విమానాశ్రయం నుంచి వెచ్చి వెళ్లనున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రయాణికుల సంఖ్య 4 లక్షల నుంచి 8లక్షలకు పెరిగింది. సర్వీసులు రోజూ 11 ఉండగా.. ప్రస్తుతం 53కు చేరాయి. త్వరలో అంతర్జాతీయ సర్వీసులు సైతం విమానాశ్రయం నుంచి ప్రారంభమవ్వనున్నాయి. తొలి సర్వీసు దుబాయ్‌కు నడవనుంది. ఎయిరిండియా సంస్థ అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. దీంతో గన్నవరం పూర్తిస్థాయి అధునాతన సౌకర్యాలు, సర్వీసులు ఉన్న విమానాశ్రయంగా రూపుదిద్దుకోనుంది. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఏదో ఒక నగరానికి ప్రతి అరగంటకూ ఒక సర్వీసు గన్నవరం నుంచి నడుస్తోంది. దీంతో అంతర్జాతీయ అనుసంధానం కూడా ఇప్పటికే అందుబాటులోనికి వచ్చింది. ఇక్కడి నుంచి ఈ ఐదు నగరాలకు చేరుకుని అక్కడి నుంచి తేలికగా విదేశాలకు వెళ్లిపోతున్నారు. కొన్ని విమానయాన సంస్థలు ఇక్కడి నుంచే కనెక్టివిటీ టిక్కెట్లను కూడా ఇస్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్‌, దిల్లీ, ముంబయిల్లో అదే విమానయాన సంస్థకు చెందిన మరో విమానంలో ఎక్కి వెళ్లిపోతున్నారు.
ప్రధాన నగరాలన్నింటికీ అనుసంధానం..

రాజధాని స్థాయికి తగ్గట్టుగా త్వరితగతిన మౌలికవసతులు, సర్వీసుల పరంగా విమానాశ్రయం అభివృద్ధి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విమానాశ్రయంలో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నాం. విమానయాన సంస్థలు సైతం సర్వీసులను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. వారికి అవసరమైన సౌకర్యాలను వెంటవెంటనే కల్పించడం, ప్రయాణికుల రద్దీ కూడా అధికంగా ఉండడం జరుగుతోంది. ఇప్పటికే గన్నవరం నుంచి అన్ని ప్రధాన నగరాలకూ సర్వీసులు నడుస్తున్నాయి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *