
తెలంగాణ టీడీపీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్కి అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఎదుటే ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలతో సమావేశం దద్దరిల్లింది. టీఆర్ఎస్లో టీడీపీని విలీనం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని కార్యకర్తలు నినాదాలు చేశారు. తెలంగాణలో బీజేపీతో పాటు టీఆర్ఎస్తో కూడా పొత్తు వద్దని చంద్రబాబును కోరారు. దీంతో నినాదాలు చేస్తున్న కార్యకర్తలను సముదాయిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎల్లకాలం ఉంటుందని చెప్పారు. పార్టీని విలీనం చేసే హక్కు ఎవరికీ లేదని వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే పొత్తులు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.