
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్ పేర్లను ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కాగా, రాజ్యసభకు ఎంపికైన వారిలో సీఎం రమేశ్ తో పాటు వర్ల రామయ్య పేరు కూడా మొదట్లో బాగా వినపడింది. అయితే, చివరి నిమిషం వరకూ రేస్ లో ఉన్న వర్ల రామయ్యకు అవకాశం దక్కకపోగా, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ అవకాశం లభించడం గమనార్హం. రాజ్యసభలో రెండు స్థానాలనూ ఓసీలకే కేటాయించినట్టు అయిందని, సీఎం చంద్రబాబు సహజశైలికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.
పార్టీ నిర్ణయం బాధ కలిగించినప్పటికీ చంద్రబాబు ఆదేశం శిరోధార్యం : వర్ల రామయ్య
రాజ్యసభ అభ్యర్థిగా టీడీపీ నేత వర్ల రామయ్యను ఎంపిక చేస్తారని చివరి నిమిషం వరకూ అనుకున్నారు. కానీ, మారిన సమీకరణాల ప్రకారం టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.., పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు బాధ కలిగించినప్పటికీ, అధినేత చంద్రబాబు ఆదేశం శిరోధార్యంగా భావిస్తానని అన్నారు. కొందరు నేతలు వ్యవహరించినట్లు తాను పదవుల కోసం పార్టీ మారే రకం కాదని, చంద్రబాబుకు అండగా ఉండాలనే తన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని తెలిపారు.