
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ చిత్రవిచిత్ర వేషధారణతో పార్లమెంటులో నిరసనలు తెలిపిన టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ను యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అభినందించారు. శుక్రవారం హిజ్రా వేషధారణలో వచ్చిన ఆయన పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం ముందు నిరసన తెలుపుతున్న సమయంలో.. ఆమె అదే ద్వారం నుంచి బయటకు వచ్చారు. అక్కడే ఉన్న శివప్రసాద్‌ను చూసి పలకరించారు. ‘గుడ్.. బాగా చేస్తున్నారు. మీరు మంచి యాక్టర్’’ అని సోనియా ప్రశంసించారు. అందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హిజ్రా వేషంలో శివప్రసాద్ ప్రధాని మోదీని ఉద్దేశించి ఇలా పాట పాడారు.
‘‘మోదీ బావా.. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే..
నీ అంతం ఆరంభం..
వెంకన్న సాక్షిగా మాట ఇచ్చీ..
చిచిచి.. చిచిచి… చిచిచిచిచిచీ..ఛీ
వెంకన్న సాక్షిగా మాట ఇచ్చీ పంగనామం పెట్టినావే..
చంద్రబాబుకు కోపమొస్తే… అవుటయ్యిపోతావు.
నీ మీద ఒట్టూ.. అవుటయ్యి పోతావూ..
రైల్వే జోనూ వైజాగ్‌కు ఇవ్వాలి..
స్టీలు ఫ్యాక్టరీ కడపలో పెట్టాలి..
పోలవరం పొంగిపొరలాలీ..
ఇవన్నీ జరగకుంటే… అవుటయ్యిపోతావు…
నీ మీద ఒట్టు…’’


‘‘బావా… ఎంటి బావా… అవన్నీ చేసేయి బావా… నిన్నందరు మెచ్చుకుంటారు బావా… నువ్వు మాటిచ్చిందే కదా… పో బావా… మళ్లీ కలుస్తాలే…’’

కొనసాగిన టీడీపీ ఎంపీల ఆందోళన
పార్లమెంటు సమావేశాల చివరి రోజు కూడా టీడీపీ ఎంపీలు నిరసనలు కొనసాగించారు. ప్లకార్డులు పట్టుకొని పార్లమెంటు ఆవరణలో నినాదాలు చేశారు. అశోక్ గజపతిరాజు, కొనకళ్ల నారాయణ, టీజీ వెంకటేశ్, మురళీమోహన్, మాగంటి బాబు, అవంతి శ్రీనివాస్, మాల్యాద్రి శ్రీరాం, తోట సీతారామలక్ష్మి, నిమ్మల కిష్టప్ప, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని పాల్గొన్నారు.