ఆర్ ఎక్స్ 100 మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: కె.సి.డ‌బ్ల్యు
న‌టీన‌టులు: కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, రావు ర‌మేశ్‌, రాంకీ, గిరిధ‌ర్‌, ల‌క్ష్మ‌ణ్‌, త‌దిత‌రులు
సంగీతం: చైత‌న్ భ‌రద్వాజ్‌
క‌ళ‌: ర‌ఘు కుల‌క‌ర్ణి
కూర్పు: ప‌్రవీణ్ కె.ఎల్‌
చాయాగ్ర‌హ‌ణం: రామ్‌
నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌
ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి

గ‌త రెండేళ్ల స‌మ‌యంలో కంటెంట్ బావున్న సినిమాల‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాలుగా విడుద‌లై పెద్ద విజ‌యాలు అందుకున్నవి చాలానే ఉన్నాయి. అలా కొత్త న‌టీనటుల‌తో రూపొంది.. ట్రైల‌ర్ నుండి మంచి అంచ‌నాలు అందుకున్న చిత్రం `ఆర్ ఎక్స్ 100`. రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం అంచ‌నాల‌ను అందుకుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం…

క‌థ‌:
ఆత్రేయ పురంలో శివ‌(కార్తికేయ‌).. ఇందు(పాయ‌ల్ రాజ్‌పుత్‌) ప్రేమ‌లో ప‌డి ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు. శివ‌ను పెంచి పెద్ద చేసిన డాడీ(రాంకీ).. త‌న గురించి బాధప‌డుతూ ఉంటాడు. ఇందు తండ్రి విశ్వ‌నాథం(రావు ర‌మేశ్‌) .. శివ‌ను కంట్రోల్ చేయ‌డానికి నానా ఇబ్బందులు ప‌డుతుంటాడు. శివ‌, ఇందు ప్రాణ ప్ర‌దంగా ప్రేమించుకుంటారు. విష‌యం తెలిసిన విశ్వ‌నాథం ఇందుకు వేరే పెళ్లి చేసి అమెరికా పంపేస్తాడు. ఇంత‌కు ఇందు ఆత్రేయ‌పురంకి వ‌స్తుందా? శివ ప్రేమ‌ను అంగీక‌రిస్తుందా? అస‌లు స‌మ‌స్య ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

ప్ల‌స్ పాయింట్స్‌:
– ప్రేమ‌లో కొత్త‌కోణాన్ని చూపెట్టే ప్ర‌య‌త్నం
– హీరో, హీరోయిన్ న‌ట‌న‌
– నెటివిటీ సినిమాటిక్‌గా లేక‌పోవ‌డం

మైన‌స్ పాయింట్స్‌:
– సాగ‌దీసిన క‌థ‌నం
– చివ‌రి ప‌దిహేను నిమిషాల మొత్తం క‌థ‌ను రాసుకున్న‌ట్లు ఉంది
– నేప‌థ్య సంగీతం బాలేదు

విశ్లేష‌ణ‌:
ప్రేమ‌లో విఫ‌లం కావ‌డానికి కార‌ణాల‌ను ప‌లు కోణాల్లో ఆవిష్క‌రించారు. అయితే ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి.. త‌న‌కు తెలిసిన ఓ నిజ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. ప్రేమ‌లో త‌ల్లిదండ్రులు, ప్రేమికుడు మోసం చేయ‌డ‌మే కాదు.. ప్రేమికురాలి మోసం కూడా ఉంటుంద‌నే పాయింట్ బాగానే ఉంది. ఈ పాయింట్‌ను తెలుగు సినిమాల్లో పాక్షికంగా చూపించినా.. మెయిన్ పాయింట్‌గా పెట్టి సినిమాను డ్రైవ్ చేశాడు ద‌ర్శ‌కుడు. అయితే చివ‌రి ప‌దిహేను నిమిషాల కోసం మొత్తం క‌థ‌ను రాసుకున్న‌ట్లు అనిపిస్తుంది. నెటివిటీని ఎక్క‌డా క‌మ‌ర్షియ‌ల్‌గా చూపెట్టే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. హీరోయిన్ పాయల్ చ‌క్క‌గా న‌టించింది. అయితే ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న పాయింట్‌ను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌లేక‌పోయాడు. సినిమా ఆసాంతం ఏదో మిస్ అయిన ఫీలింగ్ ప్రేక్ష‌కుడికి వ‌చ్చేస్తుంది. అది సినిమా చూసే ప్రేక్ష‌కుడికి ఇబ్బందిగా అనిపిస్తుంది. రెండు, మూడు మూతి ముద్దుల సీన్స్ పెట్టేస్తే.. ప్రేక్ష‌కులు సినిమాల‌ను చూసేస్తార‌ని అనుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టో తెలియ‌దు. నిజ‌మైన ప్రేమ‌లో ఎమోష‌న్ ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ అందించిన నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేయ‌లేదు.

ఇక ఆయ‌న అందించిన ట్యూన్స్‌లో కొడ‌వ‌లి నిండా కుంకుమ పూలే.. , పిల్లారా పాట‌లు చాలా బావున్నాయి. వాటిని మాంటేజ్ సాంగ్స్‌లా చూపేయ‌డం క‌థ‌లో భాగ‌మే అయినా.. ప్రేక్ష‌కుడికి అలాంటి ఓమంచి పాట‌ల‌ను తెర‌పై క‌థ‌లో భాగంగా చూస్తే రుచించ‌వు. సినిమా రెండున్న‌ర గంట‌లు ఉంది. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ క‌త్తెర‌కు ప‌ని చెప్పి ఉంటే బావుండేద‌నిపించింది. రామ్ సినిమాటోగ్ర‌ఫీ ఓకే. హీరో కార్తికేయ‌, హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ చ‌క్క‌గా న‌టించారు. ప్రేమికుడ్ని మోసం చేయాల‌నుకునే ప్రేయ‌సిగా పాయల్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. రావు ర‌మేశ్ పాత్ర బావుంది. డాడీ పాత్ర‌లో న‌టించిన రాంకీ పాత్ర‌ను ఇంకాస్త ఎలివేట్ చేసుండొచ్చు అనిపించింది. సినిమా అంతా నాలుగు పాత్ర‌ల చుట్టూనే ఎక్కువ‌గా తిరిగింది. ఇక ల‌క్ష్మ‌ణ్.. అడ‌పా ద‌డ‌పా రెండు, మూడు పాత్ర‌లు క‌నిపించాయి. సినిమాలో కామెడీ పార్ట్ లేదు. అయితే లిప్ లాక్ సీన్స్‌… హీరోని హీరోయిన్ మోసం చేయ‌డం.. అనే పాయింట్స్ .. క్లైమాక్స్ అస‌లు విష‌యం తెలుసుకున్న హీరో ఆమెను నిల‌దీసే సన్నివేశం బి, సి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాలైతే ఉన్నాయి. దీన్ని కూడా కాద‌న‌లేం. అయితే విడుద‌ల‌కు ముందు సినిమా అహో, ఒహో అనేంత తెర‌పై లేదు.

చివ‌ర‌గా.. `ఆర్ ఎక్స్ 100` …పంక్చ‌ర్‌
రేటింగ్‌: 2/5

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *