
తిరుపతి పోలీసులు ఇప్పుడు ఒక నటుడి కోసం గాలిస్తున్నారు. పొట్టకూటి కోసం దొరికిన పాత్రలన్నీ చేస్తూ, టీవీ సీరియల్స్ లో నటిస్తూ, ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో నటించిన సదరు వ్యక్తి ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాతో చేతులు కలిపాడు.
ఆ తర్వాత సొంతంగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ అనతికాలంలోనే కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఇటీవల తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా తీసిన సినిమాలో స్మగ్లర్ కం ఆర్టిస్ట్ అయిన ఇతడు ఆ సినిమాలో పెట్టుబడి కూడా పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఈ జబర్ధస్త్ నటుడికి తమిళనాడు, కర్నాటకకు చెందిన బడా స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించి, పక్కా ఆధారాలతో ఇప్పటికే నటుడిపై 20 కేసులు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన తోటి నటుడి సినిమాతో పాటు పలు మరికొన్ని సినిమాలకు కూడా ఇతడు ఫైనాన్స్ చేసినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు.