
ఒకే ఒక్క వీడియోతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది మలయాళ నటి ప్రియా వారియర్. ‘ఓరు అడార్ లవ్’ సినిమాతో హీరోయిన్గా ఇప్పుడిప్పుడే మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఆమె… తన మొదటి చిత్రంలోని ఒకే ఒక పాటతో ఇంత పాపులర్ అవుతానని, దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంటానని బహుషా ఊహించి ఉండదు. ఇంటర్నెట్లో వైరల్ అయిన తర్వాత ప్రియా వారియర్‌కు ఇతర ఇండస్ట్రీల నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఆమెతో సినిమాలు చేయడానికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పాటు హిందీ పరిశ్రమకు చెందిన పలువురు ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తాను రణవీర్ సింగ్ తో చేయబోయే సింహా(‘టెంపర్’ రీమేక్)లో ప్రియా వారియర్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ తెలుగులో ఎన్టీఆర్ పోషించిన పోలీస్ పాత్ర చేయబోతున్నారు. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకుడు. ఇటీవల మీడియాతో ప్రియా వారియర్ మాట్లాడుతూ… తాను బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కు పెద్ద అభిమానిని అని, అతడితో కలిసి పని చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని వెల్లడించారు.