
అసాధ్యం.. సుసాధ్యమైంది
రెండు సీజన్లలో పూర్తయిన ’పోలవరం’ డయాఫ్రమ్‌వాల్
412 రోజుల్లో 1396.60 మీటర్ల పొడవున నిర్మాణం
నేడు పైలాన్ ఆవిష్కరించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం పూర్తైంది. అసాధ్యం అనుకున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసి సుసాధ్యం చేశారు. దాదాపు రూ.400 కోట్ల ఈ ప్రాజెక్టును మొత్తం రెండు సీజన్లలో దీన్ని పూర్తిచేయగలిగారు. 2017 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 412 రోజులు బాగా శ్రమించి ఈ పనిని పూర్తి చేశారు. సోమవారం ముఖ్యమంత్రి ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండపై ఏర్పాటు చేసిన ఫైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. గోదావరి నది గర్భంలో నిర్మించే డయాఫ్రమ్‌వాల్ ఇంటి నిర్మాణానికి పునాది ఎలాగో… పోలవరం ప్రాజెక్టుకు డయాఫ్రమ్‌వాల్ అలాంటిది. దీనిపై మట్టి, రాయితో 150 అడుగుల ఎత్తున ఎర్త్‌కమ్ రాక్ ఫిల్‌డ్యామ్‌ను నిర్మిస్తారు. ఇందులో 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది.
ఈ నీరు దిగువన 93 మీటర్ల లోతువరకూ లీక్ కాకుండా ఈ వాల్ అడ్డుకుంటుంది. భూకంపాలను తట్టుకుంటుంది. అందువల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకమైనది. దీని నిర్మాణంలో ప్లాస్టిక్ కాంక్రీట్ వాడడం మరో ముఖ్యాంశం. సిమెంటు, ఇసుక అందులో తక్కువ మోతాదులో కంకర వేసి బెంటోనైట్ మిశ్రమాన్ని కలపడాన్ని ప్లాస్టిక్ కాంక్రీట్‌గా వ్యవహరిస్తారు. ఇది కాంక్రీట్ లాగే పూర్తిస్థాయిలో గట్టి పడుతుంది. నదీ గర్భంలో జరిగే మార్పులకు తట్టుకుంటుంది. విపత్తులు వచ్చి నదీ గర్భంలో దీనిపై ఒత్తిడి పెరిగినా అందుకనుగుణంగా రూపాంతరం సంతరించుకునే అవకాశం ఉంది.
ఆధునిక సాంకేతికతతో…
ఏళ్ళ తరబడి కలగా మిగిలిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకి గోదావరి నదిపై అడ్డుకట్ట నిర్మాణమే. సాంకేతికత అంతగా లేని ఆ రోజుల్లో ఏటా విరుచుకుపడే గోదారమ్మను నిలువరించడం సాధ్యమా అన్న ప్రశ్న ఆనాడు ఎదురైంది. నదీగర్భంలో రాయి తగిలేవరకు వెళ్ళి అక్కడ నుంచి కాంక్రీట్ వేసుకురావడం జరగని పని అనుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇది సుసాధ్యమైంది. ఇందుకోసం ఎల్అండ్టీ బావర్ కంపెనీతో ట్రాన్స్‌స్ట్రాయ్ గుత్తేదారు ఒప్పందం కుదుర్చుకున్నారు. పశ్చిమజర్మనీ నుంచి ఆధునిక యంత్ర పరికరాలు గ్రాబర్లు, కట్టర్లు, భారీ క్రేన్లు తెప్పించారు. ఆ దేశానికి చెందిన నిపుణులే పోలవరంలో మకాం వేసి పనులు చేపట్టారు.
* 2017 ఫిబ్రవరి ఒకటిన పనులు ప్రారంభించి తొలుత జులై 24 వరకు పని చేశారు. గోదావరిలో నీరు పెరగడం, వాతావరణం సహకరించక పోవడంతో పనులు నిలిపివేసి యంత్రాలను ఒడ్డుకు ఎక్కించారు. వరదలు తగ్గిన తరువాత 2017 అక్టోబరు 9న ప్రారంభించి నవంబరు 15 వరకు పని చేశారు. అనివార్య కారణాల వలన పనులు నిలిచిపోవడంతో నవంబరు 20న తిరిగి ప్రారంభించి 2018 జూన్ తొమ్మిది నాటికి మిగిలిన పనుల్ని పూర్తి చేశారు.