పవన్ కళ్యాణ్ కు లేఖ రాసిన ఓ ఆధికారి

నా పదవిలో ఉండి, నేనిలా రాయచ్చో లేదో నాకు తెలియదు. కానీ, ఆంధ్ర రాష్ట్ర విభజన వలన actual గా నష్టపోయిన వాళ్లలో నేనూ ఒకడిని కాబట్టి, ఆ అధికారంతో వ్రాస్తున్నాను.

ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ విభజించి, ఉత్తర ఆంధ్రని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలా? అసలు మీరు ట్విట్టర్ ద్వారా మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అని ఆలోచించరా? ఆ సమయంలో మీకేదనిపిస్తే అది వ్రాసేస్తారా?

మీరు ఒక నాయకుడు సర్. మీ వెనుకాల మీ ఫాన్స్ మాత్రమే కాదు, మీరు రాజకీయ నాయకుడిగా ఏదో చేస్తారని భావించే ఇంకొందరూ వున్నారు. మీకెన్ని ఓట్లు వస్తాయి అన్నది, ఇప్పుడు, స్పెకులేషన్ మాత్రమే కాబట్టి, దాన్ని పక్కనబెట్టితే, ఆంధ్ర దేశంలో ఈ రోజు వున్న Influencers లో మీరు ఒకరు. అందు చేత మీరు ఇంకా ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి? ఇలా మీరు ఉత్తరాంధ్ర విభజన అంటూ క్యాజువల్గా వ్యాఖ్యానించడం, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మీకు శోభస్కరంగా లేదు.

ఈవేళ మీరిచ్చిన ‘ప్రత్యేక ఉత్తరాంధ్ర’ ట్వీట్, ఆ ప్రత్యేకం యొక్క పూర్వాపరాలు,దాని, ఆర్ధిక స్థితిగతులు, ఇక వేళ విడిపోతే, మూడు జిల్లాలుగా మనగలిగిన స్థితి, ఇటువైపు, ఆంధ్ర రాయలసీమ పరిస్థితి, ఇంకా పసిబిడ్డ అని మనం చెప్పుకుంటున్న మన ఆంధ్ర, ఇప్పుడు మళ్లీ మీరు రేకెత్తిస్తున్న, ప్రత్యేక ఉత్తరాంధ్ర కుంపటిని తట్టుకోగల శక్తి ఉన్నదా, అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయా, కొంత మంది కుహనా మేధావులు, నిరుద్యోగుల సృష్టా, ఇప్పటి వరకు, ఆ ప్రాంతంలో కూడా వినిపించని ఈ సమస్య, మీకు మాత్రమే ఎలా కనిపించింది, కనీసం పిలుపు ఇచ్చే ముందు, పది మందితో చర్చించారా, ఆర్ధిక స్థితిగతులు బేరీజు జరిగిందా, ప్రజా ఆమోదం ఉందా,……….. …….. ఇవన్నీ అసలు మీరు ఆలోచించారా? లేక ఆ పిలుపు ఇస్తే passions ని పుట్టిస్తే, ఓట్లు వస్తాయని అనుకొన్నారా?

సమస్యలు లేవని కాదు సర్. వుండే ఉంటాయి. కానీ ఆ సమస్య పరిష్కారానికి, ప్రత్యేక రాష్ట్రం పరిష్కారమా? ఆ సమస్యలు ఏవి, పరిష్కారించాలంటే ఏమి చేయాలి, విభజిస్తే ఎలా పరిష్కారం అవుతుంది, ఇవేవీ ఎంపిరికల్ గా చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించేద్దాం అబ్దం కేవలం బాధ్యతా రాహిత్యం మాత్రమే.

మీరింకా రాయలసీమకు యాత్రగా రాలేదు. అక్కడ కూడా ఎవరో, ఒకరో ఇద్దరో, ప్రత్యేక రాయలసీమ అనక మానరు. ఇప్పుడు మీ ప్రత్యేక ఆంధ్ర చూసిన తర్వాత మరీ ఉత్సాహం వస్తుందేమో, ఆ ఇద్దరు ముగ్గురికి. అప్పుడు, ‘ప్రత్యేక రాయలసీమ’ పిలుపు కూడా ఇలాగే ట్విట్టర్ ద్వారా ఇచ్చేస్తారా?

అటు వైపు ప్రత్యేక ఉత్తర ఆంధ్ర, ఇటు వైపు ప్రత్యేక రాయలసీమ, ఇంక, ‘ప్రత్యేక గోదావరి జిల్లాలు’ మాత్రమే మిగిలి ఉండేది….ఆ పిలుపు కూడా ఇచ్చేయండి….ఆంధ్ర రాష్ట్రాన్ని, నాలుగు భాగాలుగా కోసేయ్యవచ్చు..!

నాలుగేళ్ళ క్రితం విడిపోయినప్పుడు, మీకసలు సంభంధం లేదు. పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి, రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో తిరిగి, ఆ ప్రాంతాన్ని ‘ప్రత్యేక రాష్ట్రం’ చెయ్యాలంటే…మీ అనాలిసిస్ అయినిస్టియన్ కూడా ఉండి ఉండదు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, దేనికవి సముద్రంలోని దీవులు కాదు సార్..! పలు ప్రాంతాలు, భౌగోళికంగానే కాదు, సామాజికంగా, వాణిజ్య పరంగా, పరిపాలనా పరంగా, వివాహపరంగా, కుటుంబ పరంగా, వంశాల పరంగా, మనుషుల మధ్య భావావేశాలు పరంగా….ఇలా ఎన్నో రకాలుగా ముడిపడి ఉంటాయి. ఇవేవీ తెలుసుకోకుండా, పట్టించుకోకుండా, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం అంటే, మీ ఓట్లకు కూడా అది ఉపయోగ పడదేమో సారూ…!

పైగా తెలంగాణా తో పోలిక వేరే..! నిజానికి తెలంగాణా అంటే, 1956 లో కలిసాము. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలు, నెల్లూరులు, ఎప్పుడూ, ఒక భాగమే కదా సారూ…! సమైక్యఆంధ్ర పోరాటంలో నాలుగేళ్ళ నాడు, అందరికంటే ఎక్కువ వైలెంట్ గా రియాక్ట్ అయింది.. విజయనగరం వాళ్లనే సంగతి మరచిపోయారా? కర్ఫ్యూ గుర్తులేదా?

మీకిష్టమైన శ్రీశ్రీ గారు స్వర్గంలోఎక్కడున్నారో గానీ
…కన్నీళ్లు కార్చడమే కాదు, బెత్తంతో నాలుగు వాయిస్తారు…. మీ ప్రత్యేక ఉత్తరాంధ్ర ప్రతిపాదన వింటే గురజాడ నుంచి రాయప్రోలు దాకా, మిమ్మల్ని, ఇంకో నాలుగు పుస్తకాలు ఎక్కువ చదువు అంటారేమో…!

సార్… ఆంధ్ర ప్రజలందరమూ, ఉత్తరాంధ్రతో కలిపి….
మీకు దణ్ణం పెడతాము. మళ్లీ విభజన చిచ్చు రగల్చకండి. మమ్మల్ని ఇలా బ్రతకనీయండి. ఇప్పటికే చచ్చి, బ్రతికి, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి నానా చావులు చస్తున్నాము రాష్ట్రమంతా….!

రాష్ట్రం మొత్తం మీకు పాదాభివందనం చేస్తాము…

మమ్మల్ని విడదీయద్దు…..విభజన చిచ్చు రగల్చద్దు.

……. నమస్తే …..

నీలాయపాలెం విజయకుమార్

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *