ఇక యాప్ తోనూ పాస్ పోర్టు కు దరఖాస్తు

పాస్ పోర్టు దరఖాస్తు మరింత సులభతరం అయింది. మొబైల్ యాప్ తోనూ ఇక పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నూతన యాప్ ను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆవిష్కరించారు. యాప్ ఆవిష్కరణ అనంతరం సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ తాజా యాప్‌ ద్వారా పాస్‌పోర్ట్‌ దరఖాస్తును దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చని, మొబైల్‌ ఫోన్ల నుంచే పాస్‌పోర్ట్‌ దరఖాస్తును నింపొచ్చని తెలిపారు. నూతన పథకాల ద్వారా పాస్‌పోర్ట్‌ విప్లవం చోటుచేసుకుందని మంత్రి పేర్కొన్నారు. హజ్‌ యాత్రకు వెళ్లే వందలాది భారత పౌరులకు సరళీకరించిన నూతన పాస్‌పోర్ట్‌ దరఖాస్తు సులభతరంగా ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల సంఖ్యను పెంచామని, ఇవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయని చెప్పారు. మరో 38 అదనపు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 260 పాస్‌పోర్ట్‌ కేంద్రాలు పనిచేస్తుండగా, త్వరలో వాటిని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ ప్రభుత్వం విస్తరిస్తుందన్నారు. గత కొన్ని రోజులుగా పాస్ పోర్టు జారీ నిబంధనలను కూడా కేంద్రం సరళతరం చేసింది. ఒకప్పుడు పాస్ పోర్టు పొందాలంటే నెలల తరబడి వేచిచూడాల్సి వచ్చేది. ఇప్పుడు డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉంటే..వెంటనే పాస్ పోర్టులు మంజూరు చేస్తున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *