ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను కలచివేశయి

ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను కలచివేశాయని, అందుకే రాజీనామా చేస్తున్నానని పరకాల ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపిన పరకాల.. జగన్ కొన్ని రోజులుగా తనపై చేస్తున్న నిందా ప్రచారంపై కలత చెందానని, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తూ.. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి అండగా ఉన్న డాక్టర్ పరకాల ప్రభాకర్.. అకస్మాత్తుగా రాజీనామా చేయడానికి కల కారణాలను తన లేఖలో పొందుపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల రాసిన లేఖలో ఏముందంటే..

Image result for parakala prabhakar

‘‘విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలో ఉండడాన్ని పదేపదే ఎత్తి చూపుతున్నారు. కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో నా ఉనికిని.. మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారు. నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ ఆపాదించి వాటిని తెరవెనుక మంతనాలకు, బేరసారాలకూ మీరు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచ స్థాయి ఆలోచనలకు తార్కాణం. నా కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతానని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోంది.

Image result for parakala prabhakar

పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరనీ, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరం. నేను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు మీరు చేపట్టిన ధర్మపోరాట దీక్ష మీదా, మీ చిత్తశుద్ధి మీదా నీలినీడలు పడకూడదని నా కోరిక. నా వల్ల మీకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ నలుసంతయినా నష్టం జరగరకూడదని నా దృఢ అభిప్రాయం. అందువల్ల నేను ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నాను. మీ మీదా, ప్రభుత్వం మీదా బురద జల్లడానికీ, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికి నా పేరూ, నా కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకూడదు. నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను.’’ అని ఆ లేఖలో ఉంది.

పరకాల ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్రమోదీ కేబినెట్‌లో నిర్మలా సీతారామన్ మంత్రిగా ఉండడంతో దాన్ని పరకాల ప్రభాకర్‌కు ఆపాదిస్తూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిందారోపణలు చేసిన విషయం తెలిసిందే.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *