
ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన గోపీచంద్ కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా కూడా నటించి మెప్పించాడు. హీరోగా మారిన తర్వాత హిట్స్ సాధించినా.. తర్వాత విజయాల పరంపరను అందుకోవడంలో సతమతమవుతూ వస్తున్నాడు గోపీచంద్. సక్సెస్ కొట్టే ప్రయత్నంలో భాగంగా గోపీచంద్ చేసిన మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్.. `పంతం`. ఆసక్తికరమైన విషయమేమంటే ఇది గోపీచంద్ 25వ చిత్రం. తన తండ్రి విప్లవభావాలతో చేసిన సినిమాల తరహాలో కాకపోయినా.. కాస్త దానికి దగ్గరగా ఉండే కథ కావడంతో గోపీచంద్ పంతం కథతోనేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరింతకు గోపీచంద్ ఎవరిపై పంతం పట్టాడు? ఈ పంతం గోపీచంద్ హిట్‌ను అందించిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం…
కథ
ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ జయేంద్ర (సంపత్), హెల్త్ మినిస్టర్ (జయప్రకాష్‌రెడ్డి). వారిద్దరి డబ్బును ప్లాన్ వేసి కొట్టేస్తుంటాడు ఓ వ్యక్తి (గోపీచంద్). ఓసారి మినిస్టర్ కాన్వాయ్ నుంచి, మరోసారి రైలు భోగీ నుంచి, మరోసారి మినిస్టర్ హవాలా చేసే డబ్బు, ఇంకోసారి మినిస్టర్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర దాచిన డబ్బు … ఇలా చాలా విధాలుగా కోట్ల రూపాయాలను కొట్టేస్తుంటాడు. తమ డబ్బును కొట్టేసిన వ్యక్తి ఎవరో ఒకానొక సమయంలో జయేంద్రకు తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి మామూలు వాడు కాదనీ, ప్రపంచంలో టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లో ఒకరైన సురానా ఇండస్ట్రీ అధినేత కుమారుడని అర్థమవుతుంది. అంత డబ్బున్న వ్యక్తి కుమారుడికి ఇలా హోమ్ మినిస్టర్ డబ్బును దొంగలించాల్సిన అవసరం ఏంటి? అతనికి అనాథాశ్రమానికి లింకేంటి? అతను కొట్టేసిన డబ్బును ఏం చేశాడు? డొనేషన్లు కూడా అవసరం లేనంతగా తరాలు తినేలా నిధులున్న అనాథాశ్రమానికి అతని వల్ల కలిగిన ఉపయోగం ఏంటి? ఆ అనాథ ఆశ్రమం అతనికి ఎలా ఉపయోగపడింది వంటివన్నీ సస్పెన్స్. చెప్పుకోవడానికి కొత్త కథ కాదు అని ఈ సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది. మరి కొత్త కథ కాని కథను తెరమీద దర్శకుడు ఎలా కొత్తగా చెప్పాడనేది సినిమాలో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
– గోపీచంద్ లుక్స్
– యాక్షన్ పార్ట్
– డైలాగులు
– కెమెరా
– క్లైమాక్స్
మైనస్పాయింట్స్
– రొటీన్ కమర్షియల్ కథ
– రొటీన్ స్క్రీన్‌ప్లే
– సంగీతం
– కామెడీ లేకపోవడం
విశ్లేషణ:
దేశమంటే మట్టి కాదు.. మనుషులోయ్ అనుకునే ఓ యువకుడు. విదేశాల్లోని కోటీశ్వరుడైన ఆ యువకుడు తన స్వదేశం వచ్చినప్పుడు ఇక్కడ ప్రజల పరిస్థితి చూసి బాధ పడటం. అందుకు కారణమైన రాజకీయ నాయకుల పని పట్టడమే ప్రధాన కథాంశంగా పంతం సినిమా సాగుతుంది. గోపీచంద్ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ఒకవైపు కోటీశ్వరుడిగా.. మరోవైపు రాజకీయ నాయకుల నల్లధనాన్ని దోచుకునే దొంగగా మెప్పించాడు. లుక్స్ పరంగా చూడటానికి బావున్నాడు. క్లైమాక్స్ సీన్లో పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పే సందర్భంలోనూ గోపీచంద్ నటన ప్రశంసనీయం. అలాగే యాక్షన్ సీన్స్‌లో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… అదరగొట్టేశాడు. ఇక మెహరీన్ పాత్ర పాటలకే పరిమితం అయ్యింది. ఫస్టాఫ్‌లో ఆమె రోల్ ఎక్కువ సేపు తెరపై కనపడినా.. సెకండాఫ్‌లో పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇక మెయిన్ విలన్ పాత్రలో సంపత్ సునాయసంగా నటించాడు. ఇలాంటి పాత్రలో సంపత్ వంటి సీనియర్ నటుడికి పెద్దగా కష్టపడే పని ఉండదు కూడా. ఇక ఫస్టాఫ్ అంతా పృథ్వీ తనదైన కామెడీతో నవ్వించాడు. అయితే ఈ పాత్రకు కూడా పెద్ద ప్రాధాన్యత ఉండదు. కామెడీ ఉద్దేశంగానే పాత్ర ఉంటుంది. ఇక హీరో స్నేహితుడి పాత్రలో శ్రీనివాసరెడ్డి పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. రాళ్ళపల్లి, అజయ్, హంసానందిని ఇతర నటీనటులు పాత్రల మేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. దర్శకుడు చక్రవర్తి తొలి సినిమాకు కొత్త సబ్జెక్ట్ కాకుండా కమర్షియల్ సినిమాను మెసేజ్ మిక్స్ చేసి చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే సెకండాఫ్‌లో ఉన్న ఎఫెక్ట్ ఫస్టాఫ్‌లో కనపడదు. ఇది వరకు చూసిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్టైల్లోనే సినిమా రన్ అవుతుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ బావుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చిత్రీకరించిన తీరు అభినందనీయం. రమేశ్ రెడ్డి, శ్రీకాంత్ రాసిన సంభాషణలు బావున్నాయి. ముఖ్యంగా సినిమా చివరలో కోర్టులో వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకుంటాయి. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ప్రతి సీన్ గ్రాండియర్‌గా తెరపై ఆవిష్కరించారు సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల. గోపీ సుందర్ నేపథ్య సంగీతం పరావాలేదు. పాటలు మెప్పించవు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ పనితీరు మెచ్చుకోలుగా ఉంది. మొత్తంగా చూస్తే.. సినిమాలో కొత్తదనం కనపడదు. కానీ సినిమా తెరకెక్కించిన విధానంలో గ్రాండియర్ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా… పంతం.. రొటీన్ కమర్షియల్ రాబిన్ హుడ్
రేటింగ్: 2.5/5