బాలకృష్ణ, క్రిష్ మధ్య అభిప్రాయ భేదాలు!

బాలీవుడ్‌లోనే కాదు.. ఇప్పుడు తెలుగులోనూ బయోపిక్స్ జోరు పెరిగింది. ఈ క్రమంలో రాబోతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ విషయంలో కథానాయకుడు, దర్శకుడి నడుమ అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తాజా సమాచారం.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావదినం సందర్భంగా భారీఎత్తున ప్రారంభమైన బాలకృష్ణ కొత్తచిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్.. ఆ తర్వాత దర్శకుడు తేజ తప్పుకోవడంతో కాస్తంత కన్ఫ్యూజన్‌‌లో పడింది. ఎప్పుడైతే క్రిష్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాడో.. తిరిగి ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు పుంజుకున్నాయి. ఓ వైపు హిందీ చిత్రం ‘మణికర్ణిక’ను హ్యాండిల్ చేస్తూనే.. మరోవైపు ‘ఎన్టీఆర్’ బయోపిక్ పైనా దృష్టి పెట్టాడు క్రిష్. సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమాను విడుదల చేసేస్తామనే కాన్ఫిడెంట్‌కు కారణం క్రిష్ అనే చెప్పాలి. కాకపోతే ఓ విషయంలో మాత్రం బాలకృష్ణ, క్రిష్ నడుమ ఏకాభిప్రాయం కుదరడం లేదట.

పూర్తిస్థాయి చారిత్రక ఆధారాలు లేని ‘గౌతమీ శాతకర్ణి’ సినిమానే తీసి మెప్పించిన క్రిష్.. అందరికీ తెలిసిన అన్నగారి చరిత్రను కూడా అదరగొట్టేస్తాడని నమ్మాడు బాలకృష్ణ. అందుకే ఆ ఛాన్స్ క్రిష్‌ను వరించింది. కాకపోతే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని భావిస్తున్నాడట క్రిష్. నిజానికి ఎన్టీఆర్ వంటి మహానటుడి కథను ఎన్ని భాగాలుగా తీసినా ఇంకెంతో కొంత చూపించాల్సింది ఉండే ఉంటుంది. అలాంటిది ఒక్క సినిమాకే పరిమితం చేయడం ఇష్టం లేకే క్రిష్.. రెండు భాగాల కోసం పట్టుబడుతున్నాడట.

సీక్వెల్ సినిమాలకు తెలుగులో విజయావకాశాలు తక్కువ. అయితే ‘బాహుబలి’ మాత్రం రెండు భాగాలుగా విడుదలై విజయవిహారం చేసింది. అదే బాటలో ఎన్టీఆర్ సినిమాను కూడా రెండు భాగాలుగా రూపొందించాలని.. అలాగని ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఆరు నెలల విరామంతో విడుదల చేయాలని క్రిష్ అభిప్రాయపడుతున్నాడట. ఇటీవల ‘‘మహానటి, ధోని’’ చిత్రాల తరహాలో ఒకే సినిమాలో కథంతా చెప్పేయాలన్నది బాలకృష్ణ అభిమతమట. రెండు భాగాలు అని క్రిష్ ఎంత పట్టుబడుతున్నాడో.. ఒకే సినిమా అని బాలకృష్ణ కూడా అంతే పట్టుదలగా చెపుతున్నాడట. మరి ఫైనల్‌గా ఈ ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *