
హైదరాబాద్: కేవలం సినిమాల్లోనే గాక రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన నట సౌర్వభౌముడు నందమూరి తారకరామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. నందమూరి హరికృష్ణ, పురందేశ్వరీ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్తో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఆయన సమాధి వద్ద నివాళులర్పించి.. స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. తెలుగువారి ఖ్యాతి దశదిశలా వ్యాప్తిచేసిన మహానటుడు మన ఎన్టీఆర్. తాను అన్న ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన జీవిత చరిత్ర తెరకెక్కించి జాతి మొత్తానికి అందించే గొప్ప అవకాశాన్ని, మహాభాగ్యాన్ని కలుగజేసిన బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో.. అన్నగారి జయంతి రోజున ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాటిస్తున్నా అని పేర్కొన్నారు.