ఆధారాల్లేని ఆరోపణలతో పెట్టుబడులపై ప్రభావం పడుతోంది: లోకేశ్‌

విజయవాడ: కాపు రిజర్వేషన్ల గురించి ప్రతిపక్ష నేత జగన్‌ ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పారో అందరికీ తెలుసని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అందుకే అనుభవం ఉన్న వ్యక్తి తమ నేతగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్‌ తనపై అదే పనిగా ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్న లోకేశ్‌…. తాను అవినీతిపరుడినే అయితే ఇన్ని ఐటీ కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలు పవన్ ఎందుకు నిరూపించలేకపోతున్నారని నిలదీశారు. తనకు పరిచయం లేని శేఖర్‌రెడ్డితో సంబంధాలు అంటగట్టడం సరికాదని హితవు పలికారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే పవన్ ఎలా బాధ పడతారో తానూ అలాగే బాధపడుతున్నానని అన్నారు.

కేంద్రం బుల్లెట్ రైలు కోసం భూమిని సేకరించలేకపోతోందన్న లోకేశ్‌.. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని రైతులు ఉదారంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పవన్ అర్థంలేని ఆరోపణలు చేయడం వల్ల ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుబడులకు వెనకాడుతున్నాయని అన్నారు. పవన్‌కళ్యాణ్‌ కూడా కొన్ని కంపెనీలను రాష్ట్రానికి తెస్తే.. వారికీ ఇప్పుడు ఇస్తున్న విధానంలోనే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఆధారాల్లేని ఆరోపణలు చేయడం వలన కంపెనీలు వెనక్కి వెళ్లిపోతాయన్న విషయాన్ని పవన్‌ గ్రహించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసినందున ప్రత్యేక అధికారుల పాలనకు నిర్ణయం తీసుకున్నామని లోకేశ్‌ వెల్లడించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *