
ఇప్పుడు అంతా బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అంతా బయోపిక్స్ హవా జోరందుకుంది. ప్రముఖ వ్యక్తుల జీవితాల్ని సినిమా రూపంలో తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ వ్యాపార దిగ్గజం బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు సెన్సార్ బోర్డు మాజీ చీఫ్, దర్శకుడు పహ్లజ్ నిహ్లనీ. ఇంతకూ ఆ ప్రముఖ వ్యాపారవేత్త ఎవరా అనుకుంటున్నారా.. ఎవరి పేరు చెబితే సెలబ్రెటీలు సైతం ఆయన వెనుక క్యూ కడతారో.. ఎవరి పేరు చెబితే బ్యాంకులకు కోపం కట్టలు తెంచుకుంటుందో.. ఆయన కనబడితే చాలు పట్టుకొని లోపల వేసి ఊచలు లెక్కబెట్టిద్దామని పోలీసులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో… ఆయనే వివిధ బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు వరకు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన ద వన్ అండ్ ఓన్లీ కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా.. అవును ఇప్పుడు ఆయన జీవితగాథను తెరకెక్కిస్తున్నారు.
ఇందులో బ్యాంక్ స్కాంల సన్నీవేశాలను చాలా వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారట. లండన్ బాబు మాల్యా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద నటిస్తున్నట్లు తెలిపారు. మాల్యా గెటప్‌లో ఉన్న గోవింద లుక్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అచ్చం మాల్యాలాంటి హెయిర్ స్టైల్‌తో ఉన్న గోవింద లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.