
ఈ ఫొటోలో కనిపిస్తోన్న మహిళ పేరు శైలజా ద్వివేది. ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తోన్న అమిత్ ద్వివేది భార్య ఆమె. అమిత్‌తో కలిసి ఒకే కార్యాలయంలో పనిచేస్తోన్న మరో మేజర్ నిఖిల్ హండా కన్ను ఆమెపై పడింది. ఒకే క్యాడర్ కావడం, ఒకే చోట పని చేస్తుండటంతో తరచూ శైలజ ఇంటికి వెళ్తుండేవాడు. భర్త స్నేహితుడే కావడంతో ఆమె కూడా నిఖిల్‌తో చనువుగానే మెలిగేది. అదే ఆమె చేసిన పొరపాటు. దాన్ని ప్రేమగా భావించాడు.
ఆమెతో వివాహేతర సంబంధానికి అర్రులు చాచాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో.. కారులో తీసుకెళ్లి గొంతు కోసి చంపాడు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించబోయి బొక్క బోర్లా పడ్డాడు. పోలీసుల చేతికి చిక్కాడు. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో శైలజ ద్వివేది మృతదేహం లభ్యమైంది.
ఆమెను మేజర్ నిఖిల్ హండా గొంతు కోసి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు పారిపోయిన అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన శైలజా ద్వివేదితో ఎనిమిదేళ్ల కిందట అమిత్‌తో పెళ్లయింది. వారికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో కలిసి ఆమె ఢిల్లీ కంటోన్మెంట్లో నారాయణ్ ఆర్మీ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు.
సైనిక ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకోవడానికి ఆమె శైలజ ఇంటి నుంచి వెళ్లారు. ఆ తరువాత ఆమె తిరిగి రాలేదు. సాయంత్రం శైలజ ద్వివేది మృతదేహం లభ్యమైంది. ఆమెను మేజర్ నిఖిల్ హండా గొంతు కోసి హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.
తనను ఆమె పెళ్లి చేసుకోవడానికి లేదా వివాహేతర సంబంధానికి అంగీకరించట్లేదన్న అక్కసుతోనే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. శైలజను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె మృతదేహం పైనుంచి కారును పోనిచ్చాడు. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నాలు చేశాడు. మూడేళ్ల కిందట అమిత్, హండా ఇద్దరూ నాగాలాండ్‌లో ఒకే చోట పనిచేశారు.
అప్పట్లో వారి రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఉండేవి. ఆ తరువాత అమిత్ ఢిల్లీకి బదిలీ అయ్యాడు. శైలజపై కన్నేసిన హండా తరచూ ఢిల్లీకి వస్తుండేవాడు. ఆమెను పెళ్లి చేసుకోమని కోరేవాడు. హత్య జరిగిన రోజు శైలజా ఆర్మీ ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ హండా కలిశాడని, అతనితోపాటు శైలజ కారులో వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కారులో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని, దీంతో హండా కత్తితో శైలజ గొంతును కోశాడని పోలీసులు నిర్ధారించారు.