
Krishna district News
భారతదేశంలో అతిపెద్ద రంగోలి చిత్రీకరణకు ఇబ్రహీంపట్నం సమీపంలో పవిత్ర సంగమం ప్రాంతం వేదికగా నిలిచింది. ప్రజలకు ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించడానికి జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకోవడంతో కృష్ణాజిల్లా ఖ్యాతిని చాటింది. కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా, తదితర అధికారులు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ సమష్టి కృషితో ఈ రికార్డు సాధించామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరికీ ఆయుధమని, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన సువర్ణావకాశమని చెప్పారు. అర్హత గల పౌరులందరూ బాధ్యతతో ఓటు కోసం నమోదు చేసుకొని, సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
జిల్లాలో మొత్తం 47లక్షల జనాభా ఉండగా సెప్టెంబరు ఒకటి నాటికి 30.51 లక్షల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యాయని, ఈ రెండు నెలల్లో 1,40,000 మంది ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు.