
కాస్టింగ్ కౌచ్, తెలుగు నటీనటులకు అవకాశాలు వంటి అంశాలపై నటి శ్రీరెడ్డి.. ప్రస్తుతం టాలీవుడ్లో చేస్తున్న నిరసనలు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని లీకులను పోస్ట్ చేస్తున్న శ్రీరెడ్డి.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఆమె నిరసనలతో టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే కదలిక మొదలైంది. తాజాగా ఆమె చేస్తున్న ఆరోపణలపై రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
‘‘నాతో సహా కొంతమంది సినీ ప్రముఖులపై ఓ నటి చేస్తున్న ఆరోపణలతో నేను షాక్‌కి గురయ్యాను. దీనిపై పోలీసులతో కూలంకషంగా, లోతుగా దర్యాప్తు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వాస్తవాలను వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. సత్యం జయించాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
కొంతమంది చీప్ పబ్లిసిటీ కోసం సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం. సినిమాలలో తెలుగు నటీనటులను తీసుకోవాలనే డిమాండ్‌ని నేను కూడా సమర్థిస్తాను. నా ‘గీతాంజలి’ సినిమాలో అంతా తెలుగువారే ఉన్నారు. అలాంటి నాపై ఆరోపణలు చేయడం తగదు. దీనిని నేను ఖండిస్తున్నాను’’ అంటూ కోన వెంకట్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.