పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత్

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక పోరులో భారత్ అద్భుత విజయం సాధించింది.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ధవన్, రోహిత్‌లు కలిసి తొలి వికెట్‌కి 86 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అయితే ఈ భాగస్వామ్యానికి స్పిన్నర్ షాదబ్ ఖాన్ తెరదించాడు. షాదబ్ వేసిన 14వ ఓవర్ తొలి బంతికి రోహిత్ శర్మ(52) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత ధవన్ అదరగొట్టాడు. రోహిత్ వికెట్ తర్వాత వేగం పెంచిన ధవన్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 46 పరుగులు చేసి ఫమీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో బాబర్ ఆజామ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్, అంబటి రాయుడుల జోడీ జట్టుకి విజయాన్ని కట్టబెట్టింది. మూడో వికెట్‌కి వీరిద్దరు కలిసి 60 పరుగులు జోడించారు. దీంతో భారత్ 29 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నమెంట్ సూపర్ ఫోర్ మ్యాచుల్లో భాగంగా ఈ నెల 23న భారత్, పాకిస్థాన్ మధ్య మరో వన్డే మ్యాచ్ జరుగనుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *