
వల్లభనేని వంశి మోహన్, కృష్ణా జిల్లాలో కీలక తెలుగు దేశం నేత. అంతే కాకుండా యువకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. తనని నమ్ముకున్న వారికి ఒక అడుగు ముందుకు వేసి న్యాయం చేసే నాయకుడు. 2014 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన వల్లభనేని వంశీమోహన్ ప్రజలకు ఎలాంటి నిర్ధిష్టమైన హామీలు ఇవ్వలేదు. ప్రజలకు మంచి చేస్తాను.. గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాను.. నియోజకవర్గంలోని మండలాల ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాను అని మూడే మూడు ప్రధాన హామీలతో ప్రజల్లోకి వెళ్లి గెలుపొందారు. గన్నవరం నియోజకవర్గం లో భూ సేకరణ కోసం చాలా సందర్భాల్లో జరిగింది. ఎయిర్‌పోర్టు విస్తరణ, వీరపనేనిగూడెం, మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులు, ఏలూరు కాల్వ డైవర్షన్, పోలవరం కుడి కాల్వ ఇలా, అనేక సందర్భాల్లో భూసేకరణ,సమీకరణలు వచ్చాయి. ఇవన్నీ వంశీకి ఇబ్బంది గా పరిణమించాయి.వంశీని ప్రశ్నించని రైతు లేడు,
ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ తీరు పట్ల రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలాంటి దశలో ఎమ్మెల్యే అన్న భేషజం లేకుండా వారిలో ఒకడిగా చాలా ఓర్పు, సంయమనంతో వ్యవహరించి రైతులకు నష్టం జరగకుండా వారు లాభపడే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి పరిహారాన్ని ఇప్పించారు. దీంతో రైతులు సంతోషంగా భూములు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించారు. వంశి బ్రాను వాల్యూ రైతుల్లో పెరిగిన సంఘటన అదే. అంతే కాకుండా రాజధాని కి సమీపంలో ఉండటంతో పారిశ్రామికం గా కూడా ఎదిగింది గన్నవరం. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం పారిశ్రామిక జోన్‌గా రూపాంతరం చెందింది. వీరపనేనిగూడెంలో ఇండస్ర్టియల్ పార్క్‌ను అభివృద్ధి చేశారు.
అమరావతి ఇండస్ర్టీస్ అసోసియేషన్ తరపున ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. అయితే పరిశ్రమల స్థాపన విషయంలో జాప్యం కొనసాగుతోంది. వారితో సంప్రదింపులు జరిపి త్వరగా సాకారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు వంశి . మల్లవల్లి మెగా ఫుడ్‌పార్క్, మల్లవల్లి మోడల్ ఇండస్ర్టియల్ పార్క్‌ల్లో కూడా పరిశ్రమలు కొలువు దీరటానికి చర్యలు ప్రారంభించాల్సి ఉంది .
ఎల్అండ్టీ – ఏపీఐఐసీ హైటెక్ సిటీలో ప్రస్తుతం ఉన్న మేథ టవర్‌తోపాటు అదనంగా మరో టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆర్టీసీ జోనల్ కాలేజీ స్థలంలో కూడా అతిపెద్ద సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. అంతే కాకుండా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా కృషి చేయటంలో ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఎమ్మెల్యే చేసిన కృషి ఫలించింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల వాటాగా చాలా వరకు తన సొంత సొమ్మును సమకూర్చి రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.
ఉంగుటూరు మండలాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకున్నారు. ఇది వంశి సొంత ఊరు, గన్నవరం నుంచి ఉంగుటూరుకు వెళ్లే ప్రధాన బీటీ రోడ్డును విస్తరించారు. దశాబ్ద కాలంగా చారిత్రాత్మక గన్నవరం నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయలేని బుడమేరు బ్రిడ్జి ప్రాజెక్టును సాధించారు. బుడమేరు బ్రిడ్జిపై ఉన్న వంతెన వరదల సమయంలో మునిగిపోతోంది. ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కాకుండా వంశీమోహన్ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతోంది. ఎమ్మెల్యే కాకముందు ఎలాంటి సేవ చేపట్టారో ఎమ్మెల్యే అయ్యాక కూడా కొనసాగిస్తున్నారు. రామవరప్పాడు ప్రాంత ప్రజలకు రైవస్ కాల్వపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రత్యేకంగా కృషి చేశారు. బాపులపాడు మండలానికి ఇండస్ర్టియల్ క్లస్టర్లు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి వాటి సాధనకు కృషి చేశారు. ఉంగుటూరు మండలాన్నే ఏకంగా దత్తత తీసుకుని ప్రజల ప్రధాన అవసరాలను తీరుస్తున్నారు. ఇక మరొక ముఖ్యమైన హామీ నియోజకవర్గ ప్రజలకు మంచి చేస్తాను అన్న వంశీ హామీ నెరవేరాలంటే నియోజకవర్గ ప్రజల చిరకాల కల బ్రహ్మయ్యలింగం చెరువును రిజర్వాయర్‌గా మార్చాలి. ఈ కీలకమైన పని నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. రిజర్వాయర్‌గా మారిస్తే.. గన్నవరం మండలంలోని ఎనిమిది గ్రామాలతో పాటు, నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ఆగిరిపల్లి మండలంలో పలు గ్రామాలకు తాగు, సాగు నీటి అవసరాలను తీర్చవచ్చు. ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చే పనిలో భాగంగా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు పస లేని విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి మట్టి తోలకం జరగనిదే రిజర్వాయర్ సాకారం కాదు. దాదాపుగా 1200 ఎకరాల పైగా విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మయ్యలింగం చెరువును తవ్వాలంటే సుదీర్ఘ సమయమే పడుతుంది. పనులు వేగవంతంగా పూర్తి చేయటానికి ఒక విధానం లేకపోవటం,
పర్యవేక్షణ లోపించడంతో ఈ పనులు ముందుకు కదలడం లేదు. వంశీమోహన్ ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రైతుల మనసు భూ సమీకరణ విషయం లో గెలుచుకున్న వంశి కష్టకాలంలో రైతులకు సాగునీరు అందించి కరువు లేకుండా చేసిన ఘనత వంశీమోహన్‌ది. పట్టిసీమ కాల్వ నీటిని ఏలూరు కాల్వకు మల్లించడమే కాకుండా మెట్ట ప్రాంతంలోని చెరువులకు తన సొంత ఖర్చుతో నీళ్లు నింపి తాగు నీరు ఇబ్బంది రాకుండా చేశారు.
ఎవరికి కష్టం వచ్చినా తక్షణం స్పందిస్తారని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. పేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగు పరచటానికి కనీసం పదివేల ఆదాయమే లక్ష్యంగా తన ప్రయత్నం సాగుతుంది అని వంశి తెలియ చేశారు. నియోజకవర్గంలో ఎవరూ చేయని అభివృద్ధి చేశా. ప్రజలకు చేస్తానని చెప్పిన వాటినన్నీ అమలు చేశాను. అయినా ఇంకా కొంత వెలితి ఉంది. మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నా. ఎలీప్ సంస్థతో మాట్లాడాను. మహిళల ఉపాధి కోసం నా సొంత నిధులను కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. విద్య, వైద్యానికి ఏ ఒక్కరూ దూరం కాకూడ దని ప్రభుత్వంతో పాటు నా తల్లిదండ్రుల పేరిట ఉన్న ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.
దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని రోడ్లను అభివృద్ధి చేశా. ఉంగుటూరు మండలానికి ప్రధాన సమస్యగా ఉన్న బుడమేరు వంతెనకు శంకుస్థాపన చేశాం. త్వరలో పనులు ప్రారంభిస్తారు అని వంశి తెలియ చేశారు.ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులు ఖర్చు చేస్తూ అభివృద్ధి చేస్తున్న వంశి కి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎన్నికల సమయానికి అవన్నీ అధిగమిస్తారు అని ఆయన అనుచరులు చెప్తున్నారు. ప్రత్యర్థులకు చిన్న పాటి అవకాశం కూడా ఇవ్వకుండా వంశి తెలుగు దేశానికి కంచుకోటగా ఉన్న గన్నవరంని మరింత దుర్భేద్యంగా మార్చారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ఫస్ట్ గెలిచే సీట్ మాదే అని తెలుగుదేశం అభిమానులు నమ్మకం గా ఉన్నారు.