
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్దేశిత గడువు కంటే అరగంట ముందే ఆరంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాల్సి ఉండగా.. 7:30కే షురూ చేశారు. తొలి అర్ధగంటలో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. బీజేపీ రెండో స్థానంలో, జేడీఎస్ మూడో స్థానంలో ఉన్నాయి. తొలి అరగంటలో కాంగ్రెస్ 28, బీజేపీ 18, జేడీఎస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. కోస్తా, ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉండగా.. మధ్య కర్ణాటకలో బీజేపీ ప్రభావాన్ని చూపుతోంది.
కర్ణాటక పోరులో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నువ్వా? నేనా అన్నట్లు కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 79 స్థానాల్లో ముందుంది. బీజేపీ అభ్యర్థులు 86 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో కొనసాగుతున్నారు. జేడీఎస్ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తంమీద కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. ముందుగా బాదామీలో వెనుకంజలో ఉన్న సిఎం సిద్ధరామయ్య ఆధిక్యంలోకి వచ్చారు. చాముండేశ్వరిలో ఆరువేల ఓట్లతో సిద్ధరామయ్య వెనుకబడ్డారు. కర్ణాటకలో హంగ్ దిశగా అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కావడంతో జేడీఎస్ పాత్ర ప్రధానం కానుంది.