
రహదారి ప్రమాదాలకు కారణమైన ఏలూరు రహదారిని మరింత పటిష్టం చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ చర్యలు తీసుకోనుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ, అమరావతి నగరాలకు నిత్యం ఎంతోమంది ప్రముఖులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి ప్రముఖుల పర్యటనలు ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి (ఎన్హెచ్16) కొంత ప్రమాదకరంగా మారింది. దీన్ని పటిష్టం చేసేందుకు రూ.35 కోట్లు మంజూరు చేసింది.
విజయవాడ నేతాజీ వంతెన నుంచి చినఆవుటపల్లి వరకు ఈ జాతీయ రహదారిని ప్రత్యేక మరమ్మతుల కింద రెండు బెట్మెన్ పొరలు (బీఎంబీసీ) వేయనున్నారు. దాదాపు 24 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ జాతీయ రహదారి మరింత సుందరంగా తయారు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ టెండర్లను పిలిచింది.
ప్రముఖులు వచ్చే వేగానికి అనుగుణంగా రహదారి లేదని నిపుణులు తేల్చారు. రామవరప్పాడు రింగు నుంచి గన్నవరం వరకు పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఎనికేపాడు వద్ద మలుపు సాంకేతికంగా సక్రమంగా లేదనే వాదన ఉంది. ఒకవైపు వాలు ఎక్కువగా ఉంది. ఇలాంటి లోపాలను సరిదిద్దనున్నారు.
పలు ప్రతిపాదనల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ రహదారి నిర్మించి పదేళ్లకు పైగా అయింది. దీంతో తరుగుదల (డిప్రిసియేషన్) కింద కేంద్ర ప్రభుత్వం ఈ మరమ్మతులకు నిధులను మంజూరు చేసినట్లు జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ ‘ఈనాడు’తో చెప్పారు. దీనికి టెండర్లను పిలిచామని చెప్పారు. అక్టోబరు నాలుగుతో గడువు ముగుస్తుందని వివరించారు. మొత్తం 24 కిలోమీటర్లు రెండు వైపులా రెండు పొరలతో బీటీ పొర ఏర్పాటు చేస్తామని చెప్పారు.