‘ఈ నగరానికి ఏమైంది?’

చిత్రం: ఈ నగరానికి ఏమైంది?
నటీనటులు: విశ్వక్సేన్‌ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభివన్‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను, అనిషా ఆంబ్రోస్‌, సిమ్రన్‌ చౌదరి తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
ఛాయాగ్రహణం: నికిత్‌ బొమ్మి
నిర్మాత: డి.సురేష్‌బాబు
రచన, దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 29-06-2018
తొలి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. చిన్న చిత్రంగా విడుదలైన ‘పెళ్ళి చూపులు’ పెద్ద విజయాన్ని అందుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కాలనుకుంటున్న తరుణంలో ‘పెళ్ళి చూపులు’ ఓ మార్గం చూపింది. ఈ చిత్రంతో తరుణ్‌ భాస్కర్‌ ప్రతిభేంటో చిత్ర రంగానికి తెలిసింది. అంతేకాదు, జాతీయ అవార్డునూ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ నగరానికి ఏమైంది?’ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. మరి కొత్త నటులతో తరుణ్‌ భాస్కర్‌ చేసిన ఈ ప్రయోగం ఎలా ఉంది? పోస్టర్లు, ట్రైలర్‌ ద్వారా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌గా చెప్పుకొన్ని ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది?

కథేంటంటే: వివేక్‌(విశ్వక్సేన్‌ నాయుడు), కార్తీక్‌(సుశాంత్‌రెడ్డి), కౌశిక్‌(అభినవ్‌గో మతం), ఉపేంద్ర(వెంకటేశ్‌ కాకుమాను) నలుగురు స్నేహితుల కథ ఇది. వీరు ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలని అనుకుంటారు. దాంతో తమ ప్రతిభకు ఈ ప్రపంచానికి చూపించాలని అనుకుంటారు. కానీ, వివేక్‌కు చాలా కోపం. దాన్ని అదుపులో ఉంచుకోలేడు. దానికి తోడు లవ్‌ ఫెయిల్యూర్‌. ఈ గ్యాంగ్‌ మధ్య కూడా తరచూ గొడవలు వస్తుంటాయి. కార్తీక్‌ జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఓ పార్టీకి తన స్నేహితులు ముగ్గురినీ పిలుస్తాడు. పబ్బులో చిత్తుగా తాగిన ఈ నలుగురు స్నేహితులు ఆ మత్తులో గోవా వెళ్లి పోతారు. అక్కడకు వెళ్లాక, ఈ నలుగురూ ఏం చేశారు? తమ స్నేహాన్ని, జీవితాన్ని ఎలా సరిదిద్దుకున్నార? వారి మధ్య సాగే అల్లర్లు, చిరు కోపాలు, ఎలా సాగాయి అనేదే కథ.

ఎలా ఉందంటే: ‘పెళ్ళి చూపులు’ సినిమాతో ఒక న్యూఏజ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ను తెరపై చూపించగలిగాడు తరుణ్‌ భాస్కర్‌. తన బలం కథ రాసుకోవడంలో లేదని, ఆ సన్నివేశాలను అత్యంత సహజత్వంతో తీర్చిదిద్ది, మాటల మేజిక్‌తో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంలో ఉందని ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. మరోసారి ఆ బలాన్నే నమ్ముకున్నాడు. ‘ఈ నగరానికి ఏమైంది’లో కథేమీ ఉండదు. కేవలం నలుగురు స్నేహితుల ప్రయాణం మాత్రమే. దాన్ని యువతకు ముఖ్యంగా స్నేహితులకు నచ్చేలా అందంగా సహజంగా, తెరకెక్కించాడు. వివేక్‌ యాటిట్యూడ్‌, కార్తీక్‌ సిన్సియారిటీ, కౌశిక నవ్వులు, ఉపేంద్ర అమాయకత్వం ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో షేడ్‌ ఇచ్చి, వాటితోనే వినోదం పండించే ప్రయత్నం చేశాడు. సినిమాలో 60 సన్నివేశాలు ఉంటే, ఏ సన్నివేశంలోనూ సినిమాటిక్‌ ఉండదు. నలుగురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్నట్లు కలిసి ప్రయాణం చేస్తున్నట్లు, కొట్టుకుంటున్నట్లు ఉంటుంది. సంభాషణల్లో ఉండే, సహజత్వం అందం ఆయా సన్నివేశాలను పూర్తిగా నిలబెట్టాయి.
ద్వితీయార్ధం మొత్తం గోవా నేపథ్యంలోనే సాగుతుంది. అక్కడకు వెళ్లిన తర్వాత కథను నడిపించడం కాస్త కష్టమైంది. అక్కడ షార్ట్‌ ఫిల్మ్‌ కోసం ప్రయత్నాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కాకపోతే మధ్య మధ్యలో తరుణ్‌ భాస్కర్‌ తన రచనా నైపుణ్యం చూపించడంతో కొన్ని సన్నివేశాలు మనస్ఫూర్తిగా నవ్విస్తాయి. చివర్లో ఎమోషన్‌ పండించే అవకాశం ఉన్నా, దాని జోలికి వెళ్లకుండా కథను మరింత సహజంగానే ముగించాడు. బలమైన కథ లేకపోవడంతో సన్నివేశాలు అప్పుడప్పుడు పట్టు తప్పినట్లు, పాత్రలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నట్లు అనిప్తాయి. వివేక్‌ పాత్రలో ‘అర్జున్‌రెడ్డి’ ఛాయలు కనిపించడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ప్రేమ జంట విడిపోవడానికి పెద్ద కారణం లేకపోవడం దాన్నే తలచుకుంటూ వివేక్‌ కొన్నేళ్ల పాటు స్నేహితులకు దూరంగా ఉండటం అతకలేదు. మద్యం తాగే సన్నివేశాలు ఎక్కువ కావడం కుటుంబ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించేదే. యువతరానికి నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. వాటిని నమ్ముకునే ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది.

ఎవరెలా చేశాంటే: పాత్రధారులను ఎంచుకోవడంలో తరుణ్‌ భాస్కర్‌ మరోసారి విజయం సాధించాడు. తెరపై కనిపించే నలుగురూ కొత్తవారు. వారి నుంచి తనకు కావాల్సిన సహజమైన నటన రాబట్టుకున్నాడు. ముఖ్యంగా కౌశిక్‌ నటన ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాల్లో నవ్విస్తుంది. ముఖ్యంగా వివేక్‌ మద్యం సేవిస్తున్నప్పుడు ఎదురుగా కూర్చొని హావభావాలు పలికించిన తీరు కడుపుబ్బా నవ్విస్తుంది. కథానాయికలు అందంగా కనిపించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం మరోసారి ఆకట్టుకుంటుంది. యూత్‌కు తగ్గట్టు ట్రెండీగా నేపథ్య సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ కలర్‌ కాంబినేషన్‌, సెట్టింగ్‌లు, నేపథ్యం కథకు తగినట్టు సాగాయి. రచయితగా తరుణ్‌ భాస్కర్‌ నూటికి నూరు మార్కులు కొట్టేస్తాడు. కాకపోతే మరింత పటిష్టమైన కథను రాసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణ విలువలు గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. కథకు తగినట్లు అన్ని వనరులు సమకూర్చారు.
బలాలు
+ మాటలు
+ నటీనటుల ప్రతిభ
+ యూత్‌కు నచ్చే సన్నివేశాలు

బలహీనతలు
– బలమైన కథ లేకపోవడం
– తాగుబోతు సన్నివేశాలు ఎక్కువ కావడం
చివరిగా: ‘నగర’ ప్రేక్షకులకు నచ్చుతుంది

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *