చంద్రబాబు వరాల వర్షం!

అంగన్‌వాడీ టీచర్ల జీతాలు భారీగా పెంపు
ఇక నెలకు రూ.10,500 చెల్లింపు
ఆయాలకు 6 వేలు.. సాధికార మిత్రలకు స్మార్ట్‌ఫోన్లు
నా సైన్యం 90 లక్షల డ్వాక్రా మహిళలే
నిరుద్యోగ భృతి బాధ్యతా వారికే
ప్రతి గ్రామానికి 10 స్టార్‌ రేటింగ్‌
సాధికార మిత్రల సదస్సులో సీఎం

అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. ఆ టీచర్ల జీతాలను రూ.7 వేల నుంచి రూ.10,500కి పెంచారు. ఆయాలకు రూ.4,500 నుంచి రూ.6 వేలకు వేతనం పెంచారు. ఆయన బుధవారమిక్కడ సాధికార మిత్రలతో నాలుగో సమావేశాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి కేవలం రూ.4,200 జీతం ఉండేదని.. దాన్ని గతంలో రూ.7 వేలు చేశామని, ఇప్పుడు రూ.10,500కు పెంచామని సీఎం వెల్లడించారు. పిల్లలను చక్కగా చూసుకునే అంగన్‌వాడీలకు భద్రత కల్పించేందుకు.. ఆర్థిక కష్టాలున్నా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయంతో రూ.305 కోట్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందన్నారు. అంగన్‌వాడీల చరిత్రలో నూతన అధ్యయనం ప్రారంభమైందన్నారు. మరోవైపు సాధికార మిత్రలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని కూడా సీఎం ప్రకటించారు. సెల్‌ఫోన్‌ బిల్లు విషయంలో కూడా ఇబ్బందిపడక్కర్లేదని.. నెలనెలా ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుందన్నారు. ఒక్కో సాధికార మిత్రకు కేటాయించిన 35 కుటుంబాల్లో వందశాతం సంతృప్తి ఉండేలా పనిచేయాలని పిలుపిచ్చారు.

‘ఐదు కోట్ల మంది సంతృప్తిగా ఉండేందుకు, సమస్యల పరిష్కారం జరిగేందుకు సాధికార మిత్రలు సేవాభావంతో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించాం. ప్రతి సాధికార మిత్ర తన పరిధిలోని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో చూసి అన్నీ అందేలా సాయం చేయాలి. ఎక్కడా, ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయడం.. వారి పవిత్ర బాధ్యత’ అని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం ప్రజలు సంతృప్తిగా ఉండేలా చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఐదు లక్షల మంది సాధికార మిత్రల సైన్యం తనతో ఉందని తెలిపారు. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం ఆదర్శంగా తయారుకావాలన్నారు. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం ఆర్జించేలా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అనుసంధానం చేసి అందేలా చూడాలని చెప్పారు. సమస్యలు, లోపాలుంటే ప్రభుత్వానికి చెప్పి పరిష్కరించాలన్నారు.

Image result for chandrababu dwakra mahila

సంతోషంలో దేశం కంటే ముందు..
ప్రజల సంతోషం విషయంలో దేశం కంటే రాష్ట్రం మెరుగైన ర్యాంకులో ఉందని సీఎం అన్నారు. సామాజిక మద్దతు అందరికీ ఇస్తున్నామని, 50 లక్షల మందికి పింఛన్ల నుంచి పెళ్లికానుక వరకు అందిస్తున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వంలో అవినీతి ఉందా అని అడిగితే గత ఏడాది 57 శాతం మంది లేదన్నారని, ఈ ఏడాది అది 63 శాతం మంది లేదని చెప్పారని తెలిపారు. ప్రపంచబ్యాంకు చేసిన సర్వేలో రాష్ట్రం 44వ స్థానంలో ఉంటే, దేశం 133వ స్థానంలో ఉందన్నారు. శరీరానికి, మనసుకు ప్రతిరోజు పని పెట్టాలని, అప్పుడే ఉల్లాసంగా ఉంటారన్నారు. సాధికారమిత్రల్లో ఎవరు బాగా పనిచేస్తారన్నదానిపై పోటీ పెడతానని.. ప్రతి నెలా బాగా పనిచేసే 500 మంది సాధికార మిత్రలను సదస్సుకు ఆహ్వానించి మెమెంటో ఇస్తామని చెప్పారు.

Image result for chandrababu dwakra mahila

సాధికార యాప్‌.. సమగ్ర సమాచారం
సాధికార మిత్రకు ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌లో సాధికార మిత్ర యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తారు. ఈ యాప్‌లో సాధికార మిత్ర పరిధిలోని 35 కుటుంబాల సంపూర్ణ సమాచారం ఉంటుంది. ఆయా కుటుంబాలకు రేషన్‌ వస్తుందా.. పింఛను పొందుతున్నారా.. ఉపకార వేతనం ఉందా.. ఉపాధి జాబ్‌కార్డు ఉందా.. ఇలా ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందుతున్నాయో ఉంటుంది. ఆయా కుటుంబాల వారికి ఈ లబ్ధి సక్రమంగా అందుతుందా లేదా అన్నది సాధికార మిత్రలు ఇంటింటికీ వెళ్లి అడగాలి. ఎక్కడైనా లోపాలుంటే యాప్‌లో సమాచారం ఇస్తే చాలు… రియల్‌టైం గవర్నెన్స్‌ (ఆర్‌టీజీ) ద్వారా పరిష్కరిస్తారు. అదే సమయంలో ఎవరైనా అవినీతికి పాల్పడినా, తమ గ్రామం అభివృద్ధికి ఏవైనా సలహాలు ఇవ్వాలనుకున్నా యాప్‌ ద్వారా చెప్పొచ్చు. అవి ముఖ్యమంత్రే చూస్తారు.

Related image

అదే సమయంలో ఆర్‌టీజీ ద్వారా ప్రజల్లో సంతృప్తిని సర్వే చేస్తున్న ప్రభుత్వం.. ఒక్కో సాధికార మిత్ర పరిధిలోని 35 కుటుంబాల అభిప్రాయం ఏంటనేది తెలుసుకుంటుంది. ఆ అభిప్రాయాన్ని ఆయా సాధికారమిత్రలకు పంపుతుంది. వారు ఆయా కుటుంబాల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించి.. అసంతృప్తి దూరం చేయాలి. ‘సమస్య పరిష్కారం కోసం పనిచేయాలి తప్ప.. అసంతృప్తి ఉందని చెప్పినవారింటికెళ్లి అలా ఎందుకు చెప్పారని బెదిరిస్తే ఇబ్బందులుంటాయి’ అని చంద్రబాబు చమత్కరించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *