
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగానికి పలువురు ముఖ్యమంత్రులు ఫిదా అయ్యారు. అనేక సూచనలపై హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు. సమావేశం సందర్భంగా విరామ సమయాల్లో చంద్రబాబుతో మాట్లాడడానికి పలువురు సీఎంలు ఆసక్తి చూపారు. ప్రారంభ సమయంలోనే చంద్రబాబు వద్దకు పలువురు ముఖ్యమంత్రులు రాగా మరికొంత మందిని ఆయన పలకరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబు రెండు నిమిషాలపాటు పైగా మాట్లాడుకున్నారు. సమావేశంలో బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని పేర్కొంటూ తమ రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పుదుచ్చేరి సీఎం నారాయణసామి ఏపీకి ప్రత్యేకహోదాపై గట్టిగా తన వాణి వినిపించారు. విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వ్యసాయానికి ఉపాధి అనుసంధానం చేయాలన్న చంద్రబాబు సూచనకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు పలికారు.
ఈ అంశంపై ఏడుగురు సీఎంలతో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. అందులో చంద్రబాబుకు చోటు లభించింది. చంద్రబాబు 15 ఆర్థిక సంఘం పరిశీలనాంశాల సవరణపై ప్రసంగానికి పశ్చిమబెంగాల్ సీఎం మమత మద్దతు పలికారు. మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దనే వాదననూ సమర్థించారు.
ఏపీలో విద్యుత్తు రంగంపై ప్రధాని ప్రశంస
ప్రధాని నరేంద్రమోదీ తన ప్రసంగంలో విద్యుత్తు రంగంలో ఏపీ మెరుగైన తీరు కనబరుస్తోందని ప్రశంసించారు. విశాఖపట్నంలో నూటికినూరు శాతం ఎల్ఈడీ బల్బుల వినియోగిస్తున్నారని, మిగిలిన రాష్ట్రాలు అధ్యయనం చేసి ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచన చేయడంతో చంద్రబాబుని పలువురు ముఖ్యమంత్రులు అభినందించారు. భోజన విరామ సమయంలో చంద్రబాబుతో ఈశాన్యరాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. ‘సుపరిపాలన విషయంలో మీ నిర్ణయాలను మార్గదర్శనంగా తీసుకుంటున్నామ’ని తెలిపారు.
వాజ్‌పేయీకి పరామర్శ
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయీని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఎయిమ్స్‌కు వెళ్లిన చంద్రబాబు వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతోపాటు మాజీ ప్రధాని కుటుంబసభ్యుడు రంజన్ భట్టాచార్యను అడిగి తెలుసుకున్నారు. వాజ్‌పేయీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబు విజయవాడకు బయల్దేరారు.