నన్ను, లోకేష్ ను విమర్శించేందుకేనా పవన్ ఉన్నది: సీఎం చంద్రబాబు

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘సాక్షి’ పత్రికలో గతంలో వచ్చిన అంశాలనే ఆయన ప్రస్తావించారని అన్నారు. వాటిల్లో ఎటువంటి వాస్తవమూ లేదని అన్నారు. ఈరోజు సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,… ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును తెచ్చి చదివినట్టుందని, పవన్ కల్యాణ్ ను ముందు నిలబెట్టి ఎవరో కొత్త నాటకం ప్రారంభించారని చంద్రబాబు ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరుగకుండా చూస్తామని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని గుర్తు చేసిన ఆయన, టీడీపీ సర్కారు కులాల మధ్య చిచ్చు పెడుతోందని పవన్ విమర్శించడాన్ని తప్పుబట్టారు. ఉద్దానం కిడ్నీ వంటి ఎన్నో సమస్యలను పవన్ ప్రభుత్వం దృష్టికి తెచ్చిన వేళ ఆయనపై గౌరవాన్ని చూపి సానుకూలంగా స్పందించామని, వాటన్నింటినీ మరచిపోయిన పవన్, ఇప్పుడు ఎందుకిలా విమర్శిస్తున్నాడో తెలియడం లేదని అన్నారు. ఒక్కో చోట సభ పెడితే, ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడుతున్నాడని ఆరోపించిన చంద్రబాబు, ఆయన విమర్శలు ఒక్కో సినిమాకు ఒక్కో రచయిత మాటలు రాసినట్టే ఉందని అభిప్రాయపడ్డారు. విషయం లేని విమర్శలు గుప్పించడం సరికాదని హితవు పలికారు.
నన్ను, నా కుమారుడు లోకేష్ నూ విమర్శించడానికే పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్టు కనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా రాలేదన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా పెల్లుబుకుతున్న వేళ, హోదా సాధన కోసం ఏం చేస్తామన్న విషయాన్ని చెప్పకుండా, వేరెవరి చేతుల్లోనో కీలుబొమ్మగా మారిన పవన్, చౌకబారు విమర్శలతో ప్రచారం పొందాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయంలో ఎవరి ప్రయోజనాల కోసం తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారో పవన్ తెలియజేయాలని డిమాండ్ చేశారు.
తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆస్తిపాస్తుల వివరాలను ప్రతి సంవత్సరమూ పారదర్శకంగా మీడియా ముందు బహిర్గతం చేస్తున్నామని వెల్లడించిన ఆయన, ఎన్నికల కోసం కోట్లు కూడబెట్టినట్టు పవన్ చేసిన ఆరోపణలపైనా మండిపడ్డారు. హోదాను ఇవ్వని నరేంద్ర మోదీ గురించి ఒక్క విమర్శ కూడా చేయని ఆయన తీరును చూస్తుంటే తనకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయని ఎమ్మెల్యేలు, మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, లోకేష్ చదువుకుని, ఓ కంపెనీని కూడా నిర్వహిస్తూ, ప్రజా సేవ చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చారని, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లోకేష్ కు లేదని, పవన్ చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రులు కొందరు వ్యాఖ్యానించారు.
అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది

తమిళనాడు తరహా రాజకీయాలను ఏపీలో కూడా నడిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని… అలాంటి నాటకాలు ఇక్కడ నడవబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిన్నటి దాకా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో డ్రామా ఆడించారని… ఇప్పుడు పవన్ ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఈ ఉదయం అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…ఎర్రచందనంపై పవన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని… ఎర్రచందనం స్మగ్లింగ్ పై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, స్మగ్లింగ్ ను పూర్తిగా నియంత్రించిందని చెప్పారు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపినప్పుడు… జాతీయంగా, అంతర్జాతీయంగా తనపై మానవహక్కుల సంఘాలకు ఫిర్యాదులు పంపారని గుర్తు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న తనను అరెస్ట్ చేయించేందుకు కూడా ప్రయత్నించారని… అలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని చెప్పారు. అలాంటి ఎర్రచందనంపై పవన్ అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని పవన్ చెప్పడం కూడా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. పవన్ నాటకాలకు స్క్రిప్ట్ లు ఎక్కడ నుంచి వచ్చాయో అందరికీ తెలుసని చెప్పారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *