
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈరోజు అమరావతిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు.
ఇప్పుడిప్పుడే రాజధానికి ఒక రూపు వచ్చిందని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వని బీజేపీకి అమరావతి బాండ్లపై మాట్లాడే అర్హత లేదని అయన అన్నారు. ఆత్మహత్యలకు ఎవరు పాల్పడవద్దని, ఎలాగైనా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని చెప్పారు. తెలంగాణకు చెందిన బిల్లులను నాలుగు రోజుల్లో క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
త్వరత్వరగా వృద్ధి చెందుతుంది ఏపీ నని అందేవిధంగా ప్రభుత్య పథకాలైన అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమాతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 300 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని, యువనేస్తం అనే పథకాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తామని చెప్పారు. పీడీ అకౌంట్లపై విపక్ష నేతలు రాద్ధాంతం చేయడం బాధాకరమని అయన అన్నారు.