“అస్తమించిన రవి” ఆత్మబంధువు చమన్ అంతరంగం

పరిటాల రవి గురించి చెప్పడానికి ఎంత చరిత్ర ఉందో, ఆయన అనుచరుడిగా, ఆత్మబంధువుగా చమన్ సాబ్ గురించి చెప్పడానికి అంతే చరిత్ర ఉంది. రవి వ్యక్తిగత జీవితంలోనే కాక రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించారు చమన్. పరిటాల కుటుంబ సమేతంగా భోజనం చేస్తే, చమన్ కోసం ఒక కంచం ఉంచే స్థాయిలో వీరి బంధం ఉంది. రవి వ్యక్తిగత జీవితంలో ప్రతి నిమిషం ఆయనకు తోడుగా కదిలారు చమన్.

కర్ణాటక రాష్ట్రం పావ గడ తాలూకా బందరు కొత్తపల్లిలో చమన్‌ జన్మించారు. బతుకుదెరువు కోసం ఆయన అనంతపురం జిల్లా రామగిరి మండలం ఆర్‌ కొత్తపల్లికి వలస వచ్చారు. తొలిరోజుల్లో దర్జీ పని చేసేవారు. అనంతరం గీత కార్మికునిగా మారి, వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటుచేశారు. పీపుల్స్ వార్ నుంచి రవి మరణం వరకు ఆయనకు తోడుగా ఉన్నారు. రవి రాజకీయాల్లోకి రాకముందు నుంచి చమన్ కి పరిటాల రవికి స్నేహం ఉంది.

పరిటాల రవీంద్ర తండ్రి, శ్రీరాములయ్యను ఆయన ప్రత్యర్థులు హత్య చేశారు. రవి సోదరుడు హరి తన తండ్రి బాటలో నడిచారు. హరి వెంట నడవాలని చమన్‌ నిర్ణయించుకోవడంతో, పరిటాల కుటుంబం పరిచయం అయింది. ఆ తరువాత కొద్ది రోజులకే హరిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. హరి తమ్ముడిగా రవితో 1980లో ఏర్పడిన పరిచయం ప్రాణబంధంగా మారింది.

రవి తండ్రి శ్రీరాములను, సోదరుడు హరీంద్ర హత్యలు జరిగిన తర్వాత రవి అజ్ఞాతంలో గడిపారు. అప్పుడు ఉన్న పరిస్థితుల నేపధ్యంలో రవి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సమయంలో రవి వెంట అజ్ఞాతంలో గడిపారు చమన్. పరిటాల కుటుంబం అజ్ఞాతంలో ఉండటంతో ఆ జిల్లాలో ప్రజల తరుపున ప్రశ్నించే వారు లేకపోవటంతో, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు సర్వ సాధారణం అయ్యాయి. ఆ సమయంలో రవి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని… పలువురు కోరిన నేపధ్యంలో గడ్డం సుబ్రహ్మణ్యం వంటి వారి ప్రోత్సాహంతో రవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

ఎన్టీఆర్ ని కలవడానికి ముందు రవి వెంట ఉన్న చమన్ ఆయనకు ధైర్యాన్ని ఇచ్చి ఇద్దరు కలిసి హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఎదురైన ఇబ్బందుల్లో రవికి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు చమన్. క్రమంగా జిల్లాలో ఫ్యాక్షన్ పెరుగుతున్న సమయంలో పరిటాల రవిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు చమన్. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఏ విధంగా అయితే రవి వెంట ఉన్నారో రాజకీయ జీవితంలో కుడా అదే పాత్ర పోషించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో చమన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం… తగరకుంట ప్రభాకర్, ఆర్కే (మాలపాటి వెంకటేశ్వరరావు) వంటి వారి హత్యలు తర్వాత..

రవికి ప్రభుత్వం భద్రత కుదించటం, పోలీసులు ఆయుధాలు ఉన్నాయంటూ రవి ఇంట్లో సోదాలు చెయ్యడం, ఇతరత్రా కారణాలతో కీడు శంకించిన పరిటాల రవి, తాను అజ్ఞాతంలోకి వెళ్ళకుండా అనుచరులైన పోతుల సురేష్, చమన్ వంటి వారిని వారికి ఇష్టం లేకపోయినా అజ్ఞాతంలోకి పంపించారు. రవిని విడిచి వెళ్ళటం వారికి ఇష్టం లేకపోయినా, తన మీద ఒట్టు వేయించుకుని అజ్ఞాతంలోకి పంపించారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, రక్షణ కావాలని నాటి ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ విజ్ఞప్తి చేసినా, ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్న ఆయన, 2012లో బయటకు వచ్చి రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో పరిటాల కుటుంబానికి అండగా ఉంటూ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారిపోయారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామగిరి నుంచి జెడ్పి పదవికి పోటి చేసి ఒప్పందం ప్రకారం రెండున్నర ఏళ్ళపాటు జెడ్పి చైర్మన్ గా సేవలు అందించారు. తరువాత.. మంత్రిగా పరిటాల సునీతకు ఎక్కువ అనుభవ౦ లేకపోవడంతో ఆమెకు వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. పరిటాల ఇంట్లో జరిగే ప్రతి శుభాకార్యంలో చమన్ పాల్గొంటూ వారికి తన సహాయ సహకారాలు అందించారు. ఒకానొక సందర్భంలో తన కూతురు మరణించినా.. బయటకు రాని చమన్ రవి మరణం సమయంకూడా బయటకు రాలేదు. దీనిపై ఒక ఇంటర్వ్యులో ప్రస్తావన రాగా… కూతురు చనిపోయినా ఎందుకు రాలేదు అంటే…

రవి చనిపోతేనే రాలేదు కూతురుకి ఎందుకు వస్తా అని ప్రశ్నించారు చమన్. రవికి ఇచ్చిన మాట ప్రకారం, పరిస్థితులు చక్కబడే వరకు అజ్ఞాతంలోనే ఉన్నాను అని చెప్పారు. ఇది అందరిని ఆశ్చర్యపరిచింది. రక్త సంబంధం కన్నా స్నేహం గొప్పదని చెప్పారు చమన్. తాజాగా జరిగిన పరిటాల సునీత కుమార్తె స్నేహలత వివాహంలో కూడా చమన్ అన్ని తానై వ్యవహరించారు. దీనితో రవి అభిమానులు రవి మరణంతో ఎంత క్రుంగిపోయారో చమన్ మరణంతో కూడా అదే స్థాయిలో బాధపడుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునిత జిల్లాపై పట్టు కొనసాగించడంలో చమన్ పాత్ర కీలకం. నియోజకవర్గాల మార్పు సమయంలో కూడా ఆమెకు అండగా నిలిచి రాజకీయ సలహాలు ఇచ్చారు చమన్.

చమన్ కి ఉన్న చిరకాల కోరిక, తన కొడుకుని వైద్యుడిగా చూడాలని. అది చూడకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళటంతో, ఆ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చమన్ సతీమణితో సంభాషిస్తూ, వారి కుమారుడి వైద్య విద్య విషయాని తనకు వదిలేయాలని భరోసా ఇచ్చారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *