
కావలిలో చెప్పు విసిరిన లారీ యజమాని
పట్టుకొని చితకబాదిన బీజేపీ కార్యకర్తలు
కావలి(క్రై ం), జూలై 4: నెల్లూరు జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో నష్టాల ఊబిలో చిక్కుకున్న ఒక లారీ యజమాని.. అటుగా ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వెళ్త్ను కన్నాపై చెప్పు విసిరాడు. అయితే అది గురితప్పి ర్యాలీలో ఉన్న బీజేపీ కార్యకర్తలపై పడింది. ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ చర్యకు ముఖ్యమంత్రి చంద్రబాబును బాధ్యుడిగా చూపిస్తూ కార్యకర్తలు పోలీ్‌సస్టేషన్ ఎదుట సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కన్నా లక్ష్మీనారాయణ కావలిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సాయంత్రం బీజేపీ కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఊరేగింపు స్థానిక డీఎస్పీ ఆఫీసు సమీపానికి చేరుకోగానే అక్కడ ఉన్న గొర్రెపాటి మహేశ్వరరావు చెప్పు విసిరాడు.