
ఎన్టీఆర్ సినీ జీవితంలో ‘గుండమ్మ కథ’ ఓ మైలురాయి. 56 ఏళ్ల కిందట వచ్చిన ఆ చిత్రం గురించి ఇప్పటికీ ఆసక్తికరంగా మాట్లాడుకొంటుంటారు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఆ సినిమా సంగతుల్ని, సన్నివేశాల్ని, ఆ సెట్లో హంగామాని పునఃసృష్టించి తెరపై చూపించబోతున్నారు దర్శకుడు క్రిష్.
ఆయన నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ చిత్రం కోసమే ఇదంతా. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా ఆయన తనయుడు బాలకృష్ణనటిస్తున్నారు. విద్యాబాలన్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ‘గుండమ్మ కథ’ సెట్లో,
ఆ సినిమా నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత విశేషాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ 62 గెటప్పులలో కనిపించబోతున్నారు. అందులో ‘గుండమ్మ కథ’ గెటప్ కూడా ఉండబోతోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన చిత్రమే ‘గుండమ్మ కథ’. ‘ఎన్టీఆర్’లో ఏఎన్నార్‌గా ఆయన మనవడు సుమంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. సావిత్రిగా నిత్యమేనన్ నటిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి.