అందుకే, నేను ఆ రోజు పార్లమెంటుకి మొక్కాను: చంద్రబాబు

తాను ఇటీవల ఢిల్లీకి వెళ్లి పలు పార్టీల నేతలను కలిసి ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరు గురించి వివరించి చెప్పానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ… తాను మొదటి రోజున పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి, అనంతరం పార్లమెంటుకి మొక్కి ముందుకు కదిలానని అన్నారు.

ఎందుకంటే, పార్లమెంటు ప్రజాస్వామ్యయుతంగా పని చేయాలని, అంబేద్కర్‌ ఏ ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాశారో ఈ రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసి మనకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మొక్కానని అన్నారు. అంతేగానీ కొంత మంది పేపర్లలో రాయిస్తున్నట్లు తాను వేరే ఉద్దేశంతో అలా చేయలేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడపాలన్నదే తన ప్రయత్నమని, ఢిల్లీలో పలు పార్టీల నేతలు ఏపీకి అండగా ఉంటామని చెప్పారని అన్నారు.

టీడీపీకి ఓ విశిష్టత ఉందని, ఒకసారి ఏదైనా అనుకుంటే అది సాధించేవరకు పోరాడుతుందని చంద్రబాబు అన్నారు. తాము కేంద్ర ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరట్లేదని, విభజన చట్టంలో పేర్కొన్నవే అమలు చేయాలని అడుగుతున్నామని అన్నారు. కేంద్ర మంత్రులు మాట్లాడుతూ రక్షణ శాఖకు ఇచ్చే నిధులు కూడా అడుగుతున్నారంటూ ఎగతాళి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *