అరంగేట్ర మ్యాచ్‌లో సచిన్‌ తనయుడు డకౌట్‌!

శ్రీలంక అండర్‌-19 జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టులో సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో మంగళవారం నుంచి ప్రారంభమైన అనధికార టెస్టులో తొలి రోజే ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో అర్జున్ తెందుల్కర్‌ వికెట్‌ పడగొట్టాడు. లంక ఓపెనర్‌ మిషారా(9)ను ఎల్బీడబ్ల్యూ చేసి తొలి మ్యాచ్‌లోనే తొలి వికెట్‌ దక్కించుకున్నాడు. మిగతా బౌలర్లు కూడా చెలరేగడంతో 70.3ఓవర్లలోనే శ్రీలంక 244పరుగులకే పరిమితమైంది. అయితే అరంగేట్ర మ్యాచ్‌లో ముందుగా బంతితో ఆకట్టుకున్న అర్జున్‌.. బ్యాటింగ్‌లో మాత్రం విఫలమయ్యాడు. తొమ్మిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన అర్జున్.. లంక బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో 11బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ లంక బౌలర్‌ దుల్షాన్‌ వేసిన 124ఓవర్‌ చివరి బంతికి సులభ క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇదిలా ఉండగా, సచిన్‌ తెందుల్కర్‌ కూడా అరంగేట్ర మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. 1989లో పాకిస్థాన్‌తో వన్డేల్లో అడుగుపెట్టిన సచిన్‌.. ఆ మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండా వెనుదిరగడం గమనార్హం.

భారత అండర్‌-19 జట్టుకు అనూజ్‌ రావత్‌ నాయకత్వం వహిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 134.5ఓవర్లలో 589పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక 36ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 133పరుగులు చేసింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *