
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజల్ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆ తగ్గుదల మొత్తం పైసల్లోనే కనిపిస్తోంది. ఒకరోజైతే కేవలం 1 పైసా మాత్రమే తగ్గింది. ఇంకో రోజు 6 పైసలు.. తొమ్మిది పైసలు ఇలా.. తగ్గుతూ వస్తున్నాయి. దీనిపై ఓ తెలుగు వ్యక్తికి కోపం వచ్చింది. రేట్లు పెంచినప్పుడేమో రూపాయల్లో పెంచి ఇప్పుడు పైసల్లో తగ్గిస్తారా అని కోపం వచ్చింది. దీంతో నరేంద్ర మోడీకి ఆ తగ్గిన పైసలను చెక్ గా పంపించాడు.
కేంద్ర సర్కారు తీరుకి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందు గౌడ్ ప్రధాని నరేంద్ర మోడీకి 9 పైసల చెక్కు పంపాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు ఆ చెక్‌ను అందించాడు. ఇటీవల పెట్రోల్ ధరలను 9 పైసలు తగ్గించారని, అందుకే తాను ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు 9 పైసలు విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నాడు.
వరుసగా ఆరో రోజు పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం లీటరు పెట్రోల్ పై 15 పైసలు ధర తగ్గింది. లీటరు డీజిల్ ధరపై 14 పైసలు కోత పెట్టాయి చమురు సంస్థలు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్ కూడా రూ.68.97గా నమోదైంది. మే 30 నుంచి ధరలు పైసల చొప్పున తగ్గుతుండటంతో, వరుసగా ఆరు రోజుల పాటు పెట్రోల్ ధర 46 పైసలు, డీజిల్ ధర 33 పైసలు తగ్గింది.